విద్యార్ధుల తరలింపుపై మోడీ ఫోకస్.. ఉక్రెయిన్ బోర్డర్‌కు నలుగు కేంద్ర మంత్రులు
- IndiaGlitz, [Monday,February 28 2022]
ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో అన్ని దేశాలు తమ పౌరుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం ఉక్రెయిన్ వెళ్లిన భారతీయులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉక్రెయిన్ తన గగనతలాన్ని మూసివేయడంతో భారతీయ విద్యార్ధులను దేశ పశ్చిమ సరిహద్దుకు తరలించి అక్కడి నుంచి హంగేరి, పోలాండ్ మీదుగా ప్రత్యేక ఎయిరిండియా విమానాల ద్వారా భారత్‌కు తరలిస్తున్నారు ఎంబసీ అధికారులు. ఇప్పటికే పలు విమానాలు స్వదేశానికి చేరుకున్నాయి. అయితే ఇంకా ఉక్రెయిన్‌లో పలువురు చిక్కుకుపోయారు. రష్యా అధినేత ‘‘అణుదాడి’’ హెచ్చరికలతో విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ క్రమంలో సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు ఉక్రెయిన్ సరిహద్దులకు నలుగురు కేంద్రమంత్రులకు మోడీ అప్పగించారు.
ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు ఆ నలుగురు వెళ్లి, భారతీయుల తరలింపు ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించనున్నారు. వీరిలో హర్దీప్ సింగ్ పూరీ, జ్యోతిరాదిత్య సింధియా, కిరణ్ రిజుజు, వీకే సింగ్ వున్నారు. దాదాపు 30 ఏళ్ల క్రితం కువైట్‌పై ఇరాక్ దాడికి పాల్పడిన సమయంలో అక్కడ చిక్కుకున్న 1.70 లక్షల మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు అప్పట్లో కేంద్ర ప్రభుత్వం భారీ ఆపరేషన్ చేపట్టింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత భారత్ ఈ తరహా భారీ ఆపరేషన్‌కు సిద్ధమైంది. ఉక్రెయిన్‌లో సుమారు 20 వేల మంది భారతీయులు ఉండగా, వారిలో ఇప్పటికే 4 వేల మంది భారత్‌కు తిరిగి వచ్చినట్లుగా తెలుస్తోంది. మిగిలిన వారిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర విదేశాంగ శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది.