ఏపీలోనూ విస్తరిస్తోన్న ఒమిక్రాన్.. వెలుగులోకి మూడో కేసు, తూర్పుగోదావరిలో కలకలం
Send us your feedback to audioarticles@vaarta.com
దక్షిణాఫ్రికాలో పుట్టిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్‌లో అంతకంతకూ విస్తోరిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ దీని కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలో ఎక్కువగా వుండగా.. ఏపీలోనూ విస్తరిస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో మూడో ఒమిక్రాన్ కేసు వెలుగులోకి వచ్చింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మహిళకు కొత్త వేరియంట్ నిర్ధారణ అయినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. బాధితురాలు ఈనెల 19న కువైట్ నుంచి విజయవాడకు చేరుకుని.... అక్కడి నుంచి అయినవిల్లి మండలం నేదునూరు వెళ్లినట్లు గుర్తించారు. ఆమెకు జరిపిన పరీక్షల్లో కోవిడ్ నిర్ధారణ కావడంతో ఆ మహిళ నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపగా ఒమిక్రాన్‌గా నిర్ధారణ అయింది. బాధితురాలి భర్త, పిల్లలకు జరిపిన పరీక్షల్లో కరోనా నెగటివ్ వచ్చిందని.. మరోసారి టెస్టులు చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.
అటు దేశంలో నిన్న ఒక్కరోజే 100కు పైగా ఒమిక్రాన్ కేసులు వెలుగుచూడటంతో కేంద్రం అప్రమత్తమైంది. నిన్న ఉదయానికి 236గా ఉన్న ఒమిక్రాన్ బాధితుల సంఖ్య.. తాజాగా 358కి చేరింది. ఇప్పటి వరకూ మహారాష్ట్రలో అత్యధికంగా 88 మందికి ఒమిక్రాన్ సోకగా.. దేశ రాజధాని ఢిల్లీ (67) తర్వాతి స్థానంలో ఉంది. దేశంలో ఇప్పటి వరకు 114 మంది ఒమిక్రాన్ బాధితులు కోలుకున్నట్లు కేంద్రం తెలిపింది. అలాగే నిన్న 11లక్షల మందికి పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా..6,650 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. 7,051 మంది కొవిడ్ నుంచి కోలుకోగా.. 374 మంది ప్రాణాలు కోల్పోయారు.
దేశంలోని కోవిడ్-19 పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోడీ గురువారం అధికారులతో అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. హోంశాఖ, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, పలువురు నిపుణులు ఈ భేటీకి హాజరయ్యారు.. దేశంలోని పరిస్థితి, ఒమిక్రాన్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని .. టెస్టుల సంఖ్యను పెంచడంతోపాటు.. కాంటాక్ట్‌లను ట్రేసింగ్ చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. కేసుల తీవ్రత ఎక్కువ వున్న రాష్ట్రాలకు.. కేంద్రం నుంచి ప్రత్యేక బృందాలను పంపుతామని ప్రధాని మోడీ తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout