Download App

30 Rojullo Preminchadam Ela Review

ఈ మధ్య కాలంలో పాట వల్ల క్రేజ్‌ వచ్చిన సినిమాల్లో '30రోజుల్లో ప్రేమించటం ఎలా?'. ఈ సినిమాలో 'నీలి నీలి ఆకాశం...' సాంగ్‌ యూ ట్యూబ్‌లో ట్రెండ్‌ను క్రియేట్‌ చేసింది. ఏకంగా వంద మిలియిన్‌ వ్యూస్‌ దక్కించుకుంది. ఓ చిన్న సినిమా సాంగ్‌కు ఇంత క్రేజ్‌ రావడంతో సినిమాపై అంచనాలు ఆటోమెటిక్‌గా పెరిగిపోయాయి. అదీ కాకుండా బుల్లితెరపై సందడి చేసిన ప్రదీప్‌ మాచిరాజు హీరోగా నటించిన తొలి సినిమా కూడా ఇదే. మరి ఈ అంచనాలను '30 రోజుల్లో ప్రేమించటం ఎలా?' సినిమా అందుకుందా? లేదా? అనే విషయం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథ:

1947 స్వాతంత్ర్యం వచ్చేసమయం.. అరకు ప్రాంతంలోని ఓ పల్లెటూర్లు అబ్బాయిగారు (ప్రదీప్‌ మాచిరాజు), అమ్మాయిగారు(అమృతా అయ్యర్‌) ప్రేమించుకుంటారు. పెళ్లి కూడా నిశ్చయమవుతుంది. అబ్బాయికి బాక్సింగ్‌ అంటే చాలా ఇష్టం. బ్రిటీష్‌వారితో బాక్సింగ్‌ పోటీలో గెలిస్తే తొంబై రూపాయలు వస్తాయని తెలిసి బాక్సింగ్ పోటీలకు వెళతాడు. ఒకవేళ ఆ పోటీల్లో అబ్బాయి చనిపోతాడేమోనని అమ్మాయిగారు భయపడి పోటీలకు వెళ్లొద్దని అంటుంది. కానీ అబ్బాయి వినిపించుకోడు. పోటీలో అనుకోకుండా అబ్బాయి చనిపోతాడు. ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం నచ్చక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటుంది. మళ్లీ ఈ ఇద్దరూ అర్జున్‌, అక్షరలుగా జన్మిస్తారు. ఇంజనీరింగ్‌ చదువుతుంటారు. ఇద్దరూ పక్క ఇళ్లల్లోనే ఉన్నప్పటికీ ఒకరంటే ఒకరికి పడదు. ఒకరినొకరు ఇబ్బంది పెట్టే పనులు చేసుకుంటూ ఆనందపడుతుంటారు. ఇద్దరి మధ్య దూరం పెరిగిపోతుంటుంది. అర్జున్‌కు కిక్‌ బాక్సింగ్‌ అంటే పిచ్చి.. కానీ అమ్మ అంటే అస్సలు పడదు. అలాగే అర్చన వాళ్ల అక్కయ్య ప్రేమ పెళ్లి పేరుతో ఇంటికి దూరమవుతుంది. దాంతో ఆమెకు తండ్రితో సమస్య ఉంటుంది. ఇలాంటి సమయంలో ఇద్దరి ఆత్మలు కొన్ని పరిస్థితుల్లో ఒకరి శరీరం నుంచి మరొకరి శరీరంలోకి మారిపోతాయి. అసలు ఎందుకలా అవుతుంది?  ఒక జన్మలో విడిపోయిన ప్రేమజంట ఈ జన్మలో అయినా కలుస్తుందా?  లేదా?  అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే...

సమీక్ష:

పాశ్చాత్య సంస్కృతి  పెరుగుతున్న నేటి సమాజంలో నిజమైన ప్రేమ ఉందా? అని శిష్యుడు గురువును అడిగిన ప్రశ్నతో సినిమా మొదలవుతుంది. గురువుకు అన్నీ విషయాలు ముందే తెలిసినా, కాలం ఏం చేస్తుందో చూడాలని ఆయన ఎదురుచూస్తుంటాడు. అలాంటి గురువుగా శుభలేఖ సుధాకర్‌, శిష్యుడుగా రంగస్థలం మహేశ్‌ నటించారు. ఇక సినిమాలో హీరో ప్రదీప్‌ నటన పరంగా తన బెస్ట్‌ ఇవ్వడానికి ప్రయత్నించాడు. కానీ.. అన్నీ సందర్భాల్లోనూ ఆకట్టుకోలేకపోయాడు. అలాగే అమృతా అయ్యర్‌ చూడటానికి బాగానే ఉంది. అయితే అబ్బాయిగా నటించే సన్నివేశాల్లో ఆమె నటన ఇబ్బంది కరంగా అనిపిస్తుంది. ఇక పోసాని, శివన్నారాయణ, హేమ పాత్రలు పరిమితం. వారు తమ పాత్రలకు తగ్గ న్యాయం చేశారు. ఇక హీరో స్నేహితులుగా నటించిన వైవా హర్ష, భద్రం పాత్రలు గురించి చెప్పుకునేంతగా ఏమీ లేదు. కామెడీ ట్రాక్‌ అనుకున్నంత గొప్పగా ఏమీ లేదు. ఇక అనూప్‌ సంగీతం అందించిన పాటల్లో నీలి నీలి ఆకాశం .. సాంగ్‌ మినహా మరేదీ ఆకట్టుకునేంత ఎఫెక్టివ్‌గా లేదు. దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫీ ఓకే.

సినిమాపై వచ్చిన అంచనాలను అందుకునేంత గొప్పగా ఏమీ లేదు. ఎందుకంటే దర్శకుడు మున్నాకథను అల్లుకున్న తీరు సరిగాలేదు. పాత్రలను చక్కగా డిజైన్‌ చేసుకోలేదు. హీరో తన తల్లిని ఎందుకనో ద్వేషిస్తుంటాడు. అలాగే హీరోయిన్‌ తండ్రి కూడా ఎందుకనో తన కూతుర్ని ద్వేషిస్తుంటాడు అనే సంగతి కూడా క్లారిటీగా చూపించలేదు. హేమ పాత్ర తల్లిగా అంత కష్టపడుతుంటే హీరో పాత్ర పట్టకుండా ఉంటాడు. దానికి చివరలో హీరో చెప్పే రీజన్‌ సిల్లీగా ఉంటుంది. అలాగే హీరోయిన్‌ అక్క ప్రేమ పెళ్లి చేసుకుందని ఆమె తండ్రి, ఆమెను ద్వేషిస్తుంటాడు. కానీ ఓ సన్నివేశంతో మారిపోతాడు. సినిమా కదా.. అంతే అనుకోవాలేమో. అలాగే పునర్జన్మలు, ఆత్మలు తారుమారు కావడం అనే కాన్సెప్ట్స్‌తో వేర్వేరు సినిమాలు వచ్చాయి. ఇప్పుడు రెండు కాన్సెప్ట్‌లను కలిపి సినిమాను తయారు చేసుకున్నారు. ఇక క్లైమాక్స్‌ గురించి ఎంత తక్కువగా అంత మంచిది. ఇప్పటికే ఎక్కువ సేపు కూర్చున్నారు ఇక బయలుదేరండి అనే రీతిలో క్లైమాక్స్‌ను పూర్తి చేసేశారు మరి. ప్రేక్షకుడికి తొలి అర్థగంట తర్వాత సినిమా ఏంటో అవగతమైపోతుంది. అక్కడ నుంచి అర్థం లేని కామెడి, ఇతర సన్నివేశాలు ప్రేక్షకుడికి ఇబ్బంది కరంగా అనిపిస్తాయి.

చివరగా.. '30 రోజుల్లో ప్రేమించటం ఎలా?'... ప్రేమలో పడటం ఇబ్బందే మరి

Rating : 1.8 / 5.0