జనసేన అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో 3 లక్షల ఉద్యోగాలు
Send us your feedback to audioarticles@vaarta.com
లోక్‌సభ అభ్యర్ధి అంటే రూ. 100 కోట్లు- రూ. 70 కోట్ల పెట్టుబడి వ్యాపారం అయిపోయిందనీ, జనసేన పార్టీ పెట్టుబడి లేని రాజకీయ వ్యవస్థని నిర్మిస్తుందని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ, వైసీపీ అభ్యర్ధులకి, జనసేన అభ్యర్ధులకి మధ్య తేడా గమనించాలని ప్రజల్ని కోరారు. జనసేన పార్టీ అభ్యర్ధులుగా సమస్యల మీద పోరాటం చేసే నాయకులను నిలబెట్టినట్టు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరు రైల్వే స్టేషన్ వద్ద జరిగిన బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో మూడు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. వీటిలో 25 వేల ఉద్యోగాలు పోలీస్ శాఖలో ఉంటాయన్నారు. 55 సంవత్సరాలు నిండిన ప్రతి రైతుకి రూ. 5 వేల పెన్షన్ ఇస్తామని.. ఏలూరులో ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలాలు ఇప్పిస్తామన్నారు. ప్రతి ప్రభుత్వ కాలేజీని కార్పొరేట్ కాలేజీకి దీటుగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా పవన్ హామీ ఇచ్చారు.
టీడీపీ, వైసీపీ నేతల గురించి..
"ఏలూరు పార్లమెంటరీ స్థానానికి పోటీ చేస్తున్న డాక్టర్ పెంటపాటి పుల్లారావు చట్టం తెలిసిన వారు. ఆర్ధిక వేత్త. పోలవరం, కొల్లేరు సమస్యల మీద పోరాటం చేస్తున్న నాయకుడు. ఓట్లు వేయించుకుని పార్లమెంటు హాల్లో మొద్దు నిద్రపోయే ఎంపి మాగంటి బాబు లాంటి వారు కాదు. చట్ట సభల్లో సైతం ధైర్యంగా మాట్లాడగల నాయకుడు, మేధావి. ఇలాంటి నాయకులు చట్టసభలకి వెళ్తే సమస్యల మీద బలంగా ప్రశ్నించగలరు. జనసేన పార్టీ ఓ మార్పు దిశగా అడుగులు వేస్తోంది. ఈ రోజు మొదలుపెట్టిన ఈ మార్పు పంచాయితీ ఎన్నికల్లో కూడా అమలు చేద్దాం. పంచాయితీ ఎన్నికల్లో యువత, మహిళలకి ప్రాధాన్యత ఇద్దాం. చింతమనేని ప్రభాకర్ ని అదుపు చేయడానికి ఒక మహిళని నిలబెడుతున్నా. చింతమనేని భారత రాజ్యాంగాన్ని అడ్డంగా ధిక్కరిస్తుంటే, చంద్రబాబు కూడా కంట్రోల్ చేయడం లేదు. నేను కొల్లేరు వెళ్తుంటే రాకూడదు అని హుకుం జారీ చేశారు.
నా మీద దాడులకు పాల్పడాలని చూశారు. అలాంటి చింతమనేని ని ఎదుర్కొవడానికి ఘంటసాల వెంకటలక్ష్మి గారిని నిలబెట్టా. ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి కూడా దెందులూరు ఎమ్మెల్యే దూకుడుని ఆపలేకపోయారు. అందుకే ఏలూరు అసెంబ్లీ స్థానం నుంచి చింతమనేనికి సరైన మొగుడు కార్మిక నాయకుడు రెడ్డి అప్పలనాయుడు గారిని బరిలోకి దించాం. ఒకప్పుడు చింతమనేనిని ఎదుర్కొంటే ఆయనపై అక్రమంగా కేసులు కూడా పెట్టారు. నాకు రాజకీయ అనుభవం లేదని విమర్శలు చేస్తున్నారు. ఇవి నాకు మూడో ఎన్నికలు ఒక్కొక్కరి దుమ్ము దులుపుతాం. తెలుగుదేశం పార్టీ గూండాలను ఎన్నికల్లో నిలబెడితే వాళ్ల తాట తీసే నాయకులను జనసేన నుంచి బరిలోకి దింపుతాం. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు మళ్లీ మీరే రావాలి అంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. జగన్మోహన్‌రెడ్డి నేనే ముఖ్యమంత్రి అంటున్నారు" అని పవన్ సెటైరికల్‌గా మాట్లాడారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout