Telangana Rains: దంచికొడుతున్న వానలు.. తెలంగాణలో విద్యాసంస్థలకు మూడు రోజుల సెలవులు

  • IndiaGlitz, [Monday,July 11 2022]

రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలపై ఆదివారం ప్రగతి భవన్ లో సీఎం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చెరువులు, కుంటలు, జలాశయాల్లో వరద పరిస్ధితిపై ఆయన ఆరా తీశారు.

అప్రమత్తంగా వుండండి : అధికారులకు కేసీఆర్ ఆదేశం

ఈ సందర్భంగా ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని.. అలాగే వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతం చేయాలని కేసీఆర్ సూచించారు. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా వుండాలని.. కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్ధితిని సమీక్షించాలని సీఎం ఆదేశించారు. హుస్సేన్ సాగర్, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లో వరద ప్రవాహం పెరిగేప అవకాశం వుందని అప్రమత్తంగా వుండాలని కేసీఆర్ హెచ్చరించారు.

ప్రయాణాలు వాయిదా వేసుకోండి: ప్రజలకు సీవీ ఆనంద్ సూచన

అటు నగరంలో వర్షాలు దంచికొడుతున్న నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్ ప్రజలకు కీలక సూచనలు చేశారు. నగరానికి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.. ఆదివారం రాత్రి, సోమవారం కూడా భారీ వర్షాలు పడే అవకాశం వున్నందున అప్రమత్తంగా వుండాలని సీవీ ఆనంద్ సూచించారు. అవసరమైతే బయటకు రావాలని.. ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కమీషనర్ కోరారు. 24 గంటలూ పోలీసులు అందుబాటులో వుంటారని.. జీహెచ్ఎంసీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తున్నామని సీవీ ఆనంద్ వెల్లడించారు.