3 రాజధానులపై అధికార, విపక్షాల తాజా కలవరమిది!
Send us your feedback to audioarticles@vaarta.com
మూడు రాజధానుల విభజన అంశం అటు అధికార పార్టీ, ఇటు విపక్ష నేతలు కొందరిలో కల్లోలం రేపుతోంది. కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపంలా తయారైంది వారి పరిస్థితి. దీంతో అంతా గప్ చుప్. కర్నూలు అంశాన్ని పక్కనబెడితే అటు అమరావతి, ఇటు విశాఖ మధ్య చిచ్చు రేపుతోంది. అసలు మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ అంగీకారం తెలియజేయడంతోనే వాతావరణమంతా హాట్ హాట్‌గా మారిపోయింది. అధికార, విపక్షాల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు.. వాదోపవాదాలకు అంతు లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలో ఈ ఇరు ప్రాంతాలకు చెందిన అధికార, ప్రతిపక్ష నాయకులు మాత్రం సైలెంట్ అయిపోయారు.
మూడు రాజధానుల ప్రకటనతో విశాఖ టీడీపీ నేతల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారిపోయింది. రాజధానికి వ్యతిరేకంగా మాట్లాడితే స్థానిక ప్రజానీకం నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. మాట్లాడకపోతే పార్టీ నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఏం మాట్లాడితే ఎవరి ఆగ్రహానికి గురవుతామో తెలయని పరిస్థితి. ఏం చేయాలో పాలుపోని స్థితిలో టీడీపీ నేతలు ఉండిపోయారు. కానీ పార్టీ అధిష్టానం మాత్రం పూర్తిగా అమరావతే రాజధానిగా ఉంచాలని తెగేసి చెబుతోంది. ప్రజల మద్దతు కూడా తమకే ఉందని.. ఎన్నికలకు ముందు ఈ విషయాన్ని ఎందుకు చెప్పలేదని ప్రశ్నిస్తోంది. అవసరమైతే అంతా రాజీనామాలు చేసి తిరిగి ఎన్నికలకు వెళదాం.. ప్రజల సపోర్టు మీకుంటే.. తాము రాజధాని అంశం గురించి మాట్లాడబోమంటూ సవాల్ విసురుతోంది. ఇంతటి హాట్ సిట్యువేషన్‌లోనూ ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు మాత్రం ఏమీ ఎరుగనట్టు సైలెంట్ అయిపోయారు. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ టీడీపీ నేతల పరిస్థితి ఎలా ఉందో.. ఇప్పుడు ఉత్తరాంధ్ర టీడీపీ నేతల పరిస్థితి కూడా అలాగే ఉంది.
ఉత్తరాంధ్ర టీడీపీ నేతల పరిస్థితికి ప్రస్తుత రాజధాని అమరావతి ప్రాంత వైసీపీ నేతల పరిస్థితికి తేడా ఏమీ లేదు. ఒకరకంగా చెప్పాలంటే.. మరింత ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబైనా లైట్ తీసుకుంటారేమో కానీ వైసీపీ అధినేత జగన్ మాత్రం అలా లైట్ తీసుకునే వ్యక్తి కారు. దీంతో అమరావతి ప్రాంత వైసీపీ నేతలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. విశాఖకు మద్దతిస్తే స్థానిక ప్రజానీకంతో తలనొప్పి.. ఇవ్వకుంటే అటు సీఎం జగన్ సామాన్యుడు కాదు. ఏపీలో రాజకీయం ఇంత హాట్‌గా ఉంటే అమరావతి ప్రాంత అధికార పార్టీ నేతలు మాత్రం ఒకరకంగా నిప్పుల కుంపటిని మోస్తున్నారని ప్రజల్లో చర్చ జరుగుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout