Jagananna Arogya Suraksha: నేటి నుంచే జగనన్న ఆరోగ్య సురక్ష రెండో దశ కార్యక్రమం

  • IndiaGlitz, [Tuesday,January 02 2024]

ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష(Jagananna Arogya Suraksha) రెండో దశ కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కానుంది. పట్టణాలు, నగరాల్లో రేపటి(బుధవారం)నుంచి మొదలు కానుంది. వారానికి రెండు రోజుల పాటు ఈ ఆరోగ్య సురక్ష శిబిరాలను ఏర్పాటు చేస్తారు. గ్రామాల్లో మంగళవారం, శుక్రవారం.. పట్టణాలు/ నగరాల్లో బుధవారం, గురువారం ఈ శిబిరాలు అందుబాటులో ఉంటాయి. గత మూడు నెలల్లో తొలి దశను 50 రోజుల పాటు నిర్వహించారు. దాదాపు 60 లక్షల మందికి ఈ కార్యక్రమం ద్వారా సేవలు అందించినట్లు ప్రభుత్వ తెలిపింది.

నేటి నుంచి ప్రారంభం కానున్న రెండో దశను 6 నెలలు పాటు నిర్వహించాలని సర్కార్ యోచిస్తోంది. ఇందులో మొత్తం 13,954 శిబిరాలు నిర్వహించాలని ప్లాన్ చేసింది. గ్రామాల్లో 10,032 శిబిరాలు, పట్టణాలు/నగరాల్లో 3,922 శిబిరాలు ఏర్పాటు చేయాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో జనవరి నెలలో 3,583 శిబిరాలు నిర్వహించనుంది. వాలంటీర్లు, ప్రజాప్రతినిధులు ప్రతి ఇంటికీ వెళ్లి అక్కడ ప్రజలకు దీనిపై అవగాహన కల్పిస్తారు. ఆరోగ్య సురక్ష శిబిరంలో అందే వైద్య సేవలు వివరిస్తారు.

ప్రతి శిబిరంలో ఒక మెడికల్‌ ఆఫీసర్‌తోపాటు ఇద్దరు స్పెషలిస్టు వైద్యులు, పారామెడికల్‌ ఆప్తాల్మిక్‌ అసిస్టెంట్‌ ఉంటారు. వీరితోపాటు 543 జనరల్‌ మెడిసిన్ వైద్యులు, 645 గైనకాలజిస్ట్‌, 349 జనరల్‌ సర్జన్‌, 345 ఆర్థోపెడిక్స్‌, 378 మంది ఇతర స్పెషలిస్టు వైద్యులు సేవలు అందించనున్నారు. అలాగే కంటి సమస్యలు తెలుసుకునేందుకు 562 మంది పారామెడికల్‌ ఆప్తాల్మిక్‌ ఆఫీసర్లను ప్రభుత్వం నియమించింది. ఇక శిబిరాల్లో వచ్చిన ప్రజలకు ఉన్న వ్యాధులు గుర్తించేందుకు ఏడు రకాల కిట్లు సిద్దం చేశారు. రోగులకు ఇచ్చేందుకు గ్రామాల్లో 92 రకాల మందులు, పట్టణాలు/నగరాల్లో 152 రకాల మందులు అందుబాటులో ఉంచుతోంది. వ్యాధుల పరిస్థితిని బట్టి ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు రోగులను రిఫర్ చేస్తారు. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుపేదలకు ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడనుంది.