పవన్‌తో డీల్.. 26 అసెంబ్లీ, 4 పార్లమెంట్ సీట్లు..!?
- IndiaGlitz, [Friday,March 08 2019]
2019 ఎన్నికల్లో టీడీపీ, వైసీపీలతో కలిసి పోటీ చేయనని.. కమ్యూనిస్ట్‌లతో మాత్రమే కలిసి పనిచేస్తానని ఇప్పటికే జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చిన విషయం విదితమే. ఇప్పటికే జనసేన-కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి ఆందోళనలు, నిరసనలు ఉద్యమాలు చేపట్టడం జరిగింది. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో సీపీఎం, సీపీఐలకు ఎన్నెన్ని సీట్లు కేటాయించాలనే విషయంపై జనసేనాని, నాదెండ్ల మనోహర్‌తో చర్చించడం జరిగింది. గురువారం రోజున నిశితంగా ఈ వ్యవహారంపై చర్చించి.. 26 శాసనసభ, నాలుగు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తామని పవన్‌కు చెప్పడం జరిగింది.
రాయలసీమ, కోస్తా ఆంధ్రాలో పట్టున్న నియోజకవర్గాల్లో తమకు సీట్లు కేటాయించాలని పవన్‌కు లెఫ్ట్‌పార్టీలు పవన్ విజ్ఞప్తి చేశాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ 26 సీట్లు కచ్చితంగా గెలిచి పవన్‌కు బహుమతిగా ఇస్తామని కమ్యునిస్ట్ పార్టీలు చెప్పుకొస్తున్నాయి. గురువారం నాడు విజయవాడలోని జనసేన కార్యాలయంలో నాదెండ్ల మనోహర్, వామపక్ష నేతలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సీపీఐ నుంచి ఆ పార్టీ కార్యదర్శి రామకృష్ణ, ముప్పాళ నాగేశ్వరరావు, జెల్లి విల్సన్, సీపీఎం నుంచి ఆ పార్టీ కార్యదర్శి మధు, శ్రీనివాసరావులు పాల్గొని సీట్ల విషయం చర్చించారు.
ఇదిలా ఉంటే.. కమ్యునిస్ట్లు అడుగుతోన్న స్థానాల్లో ఎవరి బలమెంత? గతంలో వారికి వచ్చిన ఓట్లు ఎలా ఉన్నాయ్..? ఆయా ప్రాంతాల్లో జనసేన పరిస్థితేంటి..? ఇలా అన్నీ బేరీజు చేసుకొని నివేదికల తీసుకొని వస్తే.. మరో రెండు మూడు రోజుల్లో చర్చించి పవన్‌తో తుది నిర్ణయం తీసుకుంటారని ఈ సందర్భంగా నాదెండ్ల స్పష్టం చేశారు.
రాజమండ్రిలో మార్చి 14న జనసేన ఆవిర్భావ సభలో అభ్యర్థుల జాబితాతో పాటు.. కమ్యునిస్ట్ పార్టీలకు ఎన్ని సీట్లు ఇస్తామనే విషయాలపై సభావేదికగా పవన్ స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఏపీలోని ప్రతి జిల్లా నుంచి సీపీఐ, సీపీఎంలు చెరో అసెంబ్లీ సీటును కోరుతుండగా, చెరో రెండు ఎంపీ స్థానాలు కూడా కేటాయించాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కమ్యునిస్ట్ పార్టీల డిమాండ్స్‌కు పవన్ ఈ డీల్‌కు ఏ మాత్రం మొగ్గు చూపుతారో తెలియాలంటే మార్చి 14 వరకు వేచి చూడాల్సిందే మరి.