జనసేన తరఫున పోటీకి 2410 మంది ఆశావహులు
- IndiaGlitz, [Monday,February 25 2019]
పాలనలో పారదర్శకత, రాజకీయ జవాబుదారీతనం తీసుకువచ్చి నిజమైన మార్పు అంటే ఏమిటో చూపించే సత్తా జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్‌ను మాత్రమే ఉందని విశ్వసించి.. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తరఫున బరిలో నిలవాలని ఆశిస్తూ వేలమంది బయో డేటాలు అందచేశారు. జనసేన అభ్యర్థిత్వాన్ని ఆశించేవారి నుంచి బయో డేటాలు స్వీకరించడం సోమవారంతో ముగిసింది. ఈనెల 13వ తేదీ నుంచి 25వ తేదీ వరకూ స్క్రీనింగ్ కమిటీ ముందుకు 2410 మంది ఆశావహులు వచ్చి తమ బయో డేటాలు అందచేశారని కమిటీ సభ్యులు స్పష్టం చేశారు.
చదువుకున్న యువతతోపాటు వృత్తి నిపుణులు, వివిధ రంగాల్లో స్థిరపడినవారు, మహిళలు జనసేన అభ్యర్థిత్వం కోసం బయో డేటాలు సమర్పించారు. డాక్టర్లు, ఐ.టీ. నిపుణులు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు, విశ్రాంత ఉన్నతాధికారులు, రక్షణ రంగంలోనివారు జనసేన తరఫున బరిలో నిలిచేందుకు ఉత్సాహంగా ముందుకు వచ్చారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ స్థానాల నుంచి ఉన్నత విద్యను అభ్యసించిన యువత బయో డేటాలు ఇచ్చారని కమిటీ సభ్యులు ఓ ప్రకటనలో తెలిపారు.
కాగా.. ఇప్పటి వరకూ వచ్చిన అన్ని బయో డేటాలను విశ్లేషించే ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. ఆశావహుల నేపథ్యం, విద్యార్హతలు, ప్రజా సమస్యలపై, రాజకీయాలపై ఉన్న అవగాహన తదితర అంశాలను విశ్లేషించేందుకు స్క్రీనింగ్ కమిటీ నేతృత్వంలో ప్రత్యేక బృందం పనిచేస్తోంది. ఈ వివరాలను త్వరలోనే వెల్లడిస్తారు. ఇదిలా ఉంటే.. ఈ నెల 12న మొదటి బయో డేటాను పవన్ సమర్పించిన సంగతి తెలిసిందే.