ఆక్సీజన్ లీక్.. సరఫరా నిలిచిపోవడంతో 22 మంది మృతి
Send us your feedback to audioarticles@vaarta.com
కోవిడ్-19 విజృంభణతోపాటు ప్రాణవాయువు కొరత వేధిస్తున్న సమయంలో ఆక్సిజన్ లీక్ అయింది. ఆక్సిజన్ ట్యాంకర్ లీక్ అవడంతో రోగులకు ప్రాణవాయువు అందించడంలో అంతరాయం ఏర్పడింది. దీంతో 22 మంది కోవిడ్ రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న డాక్టర్ జకీర్ హుస్సేన్ ఆసుపత్రిలో బుధవారం జరిగింది. ఈ ఆసుపత్రిలో దాదాపు 150 మంది రోగులు వెంటిలేటర్, ఆక్సిజన్ సరఫరాపై ఆధారపడి ఉన్నారు.బుధవారం మధ్యాహ్నం ఆక్సిజన్ ట్యాంకర్‌లో ఆక్సిజన్‌ను వేరొక ఆక్సిజన్ ట్యాంకర్ ద్వారా నింపుతున్న సమయంలో ప్రాణవాయువు బయటకు పెల్లుబికింది.
ఈ క్రమం్లోనే దాదాపు అరగంట పాటు ఆసుపత్రిలోని రోగులకు ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న 22 మంది రోగులు ప్రాణాలు కోల్పోయినట్టు ఆరోగ్యమంత్రి రాజేష్ తోపే వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్టు తెలిపారు. ట్యాంకర్ లీకవడంతో గ్యాస్ ఒక్కసారిగా బయటకు వచ్చి కమ్మేసింది. దీంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఆక్సిజన్ లీక్‌ను వెంటనే నియంత్రించారు. అయితే ఈ క్రమంలోనే ఆక్సిజన్ అవసరమైన రోగుల్లో దాదాపు 30 మందిని వేరే హాస్పిటళ్లకు తరలించారు. ఇప్పటికే మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. మరోవైపు ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. ఈ సమయంలో ఇలాంటి ఘటన జరగడం ఆందోళన కలిగిస్తోంది.
ఘటనపై మహారాష్ట్ర మంత్రి డాక్టర్ రాజేంద్ర షింగనే స్పందించారు. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అని డాక్టర్ షింగనే తెలిపారు. దీనిపై సవివరమైన నివేదికను తెప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఈ దారుణానికి బాధ్యులైనవారిని వదిలిపెట్టేది లేదన్నారు. ఘటనపై మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ఇదొక భయానక ఘటన అని.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇతర రోగులను సైతం వేరే ఆసుపత్రులకు తరలించాలని పేర్కొన్నారు. ఘటనపై తక్షణమే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments