2.0 Review
`శివాజీ`, `రోబో` సక్సెస్ తర్వాత సూపర్‌స్టార్ రజనీకాంత్, శంకర్ కాంబినేషన్‌లో సినిమా రావడానికి ఎనిమిదేళ్లు పట్టింది. అయితే మూడోసారి శంకర్ కొత్త కథతో కాకుండా రోబో సీక్వెల్‌గా `2.0`ను తెరకెక్కించాలనుకోవడం. బాహుబలి ప్రభావమో.. శంకర్ టెక్నికల్‌గా చాలా ముందుంటాడు. ఆ ప్రభావమో ఏదో మొత్తానికి `2.0`ని 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించాలనుకున్నాడు శంకర్. అంత బడ్జెట్ పెట్టి సినిమా చేయాలంటే నిర్మాతలు ఆలోచిస్తారు కదా. అయితే రజనీకాంత్, శంకర్ కాంబినేషన్.. శంకర్ మేకింగ్‌పై ఉన్న నమ్మకంతో లైకా ప్రొడక్షన్స్ సినిమా చేయడానికి ముందుకొచ్చింది. అయితే సినిమా డబుల్ బడ్జెట్ అయ్యింది. అంటే దాదాపు 600 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యింది. అయితే దక్షిణాది సినిమాల మార్కెట్ స్పాన్ పెరగడంతో పాటు కాంబినేషన్‌పై ఉన్న క్రేజ్ కారణంగా నిర్మాతలు బడ్జెట్ గురించి ఎక్కడా ఆలోచించలేదు. మరో వైపు బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ ఇందులో విలన్‌గా నటించడానికి అంగీకరించడం. ఇదంతా ఒక ఎత్తు అయితే సినిమా గత ఏడాది దీపావళికే రిలీజ్ అనుకున్నారు. కానీ విజువల్ ఎఫెక్స్ పూర్తి కాకపోవడంతో సినిమా వాయిదా పడింది. ఈ ఏడాది సంక్రాంతికి కూడా సినిమా విడుదల కాలేదు.. సరే సమ్మర్‌కైనా చేద్దామనుకుంటే కుదరలేదు. అసలు ఈ ఏడాది `2.0` సీక్వెల్ ఉండదేమో అని అనుకున్నారు. కానీ శంకర్ అండ్ టీం పడ్డ కష్టంతో సినిమా ప్రేక్షకుల ముందుంకు వచ్చింది. క్రేజీ హిట్ కాంబో.. టీజర్, ట్రైలర్ పెంచిన నమ్మకమో ఏదైతేనేం సినిమాపై అంచనాలు విపరీతంగా పెరిగాయి. మరి `2.0` ఈ అంచనాలను అందుకుందా? రజనీ, శంకర్‌లు హ్యాట్రిక్ హిట్ సాధించారా? కమర్షియల్ హంగులతో పాటు మెసేజ్‌ను మిక్స్ చేయడంలో దిట్ట అయిన శంకర్ ఈ సినిమాలో ఎలాంటి మెసేజ్ ఇచ్చాడు? అనే విషయాలు తెలియాలంటే సినిమా కథేంటో చూద్దాం.
కథ:
ఓ వ్యక్తి సెల్ టవర్‌కు ఊరి వేసుకుని ఆత్మ హత్య చేసుకుంటాడు. అతను చనిపోయిన పక్క రోజు నుండే అందరి చేతుల్లో నుండి, మొబైల్ షాప్స్‌లో నుండి సెల్‌ఫోన్స్ గాల్లో ఎగిరిపోతుంటాయి. అసలు ఎవరు ఆ పనిచేశారో తెలియక ప్రభుత్వం తల పట్టుకుని కూర్చుంటుంది. అదే సమయంలో ఓ మొబైల్ కంపెనీ ఓనర్ సెల్‌ఫోన్స్ ఆర్డర్ ఇచ్చి సరుకు రప్పించుకుంటూ ఉంటాడు. ఆ సెల్‌ఫోన్స్ కూడా కంటయినర్‌ను బద్ధలు కొట్టుకుని బయటలకు వెళ్లిపోతాయి. అదే రోజు రాత్రి మొబైల్ షాప్ ఓనర్ అనుమానాస్పదంగా సెల్‌ఫోన్స్ కారణంగా చనిపోతాడు. అదే సమయంలో మొబైల్ సర్వీస్ ప్రొవైడర్‌ను కూడా ఎవరో హత్య చేస్తారు. సైంటిస్ట్ వశీకరణ్(రజనీకాంత్)..అతను తయారు చేసిన హ్యుమనాయిడ్ రోబో వెన్నెల(ఎమీ జాక్సన్) ఈ హత్యలపై ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. వశీకరణ్ రోబో చిట్టిని తీసుకువస్తే మంచిదనే సలహా ఇచ్చిన వద్దంటుంది ప్రభుత్వం. అదే సమయంలో టలికాం మినిష్టర్ సెల్‌ఫోన్ కారణంగా చనిపోతాడు. దాంతో ప్రభుత్వ పెద్దలకు భయం పట్టుకుంటుంది. అప్పుడు చిట్టిని రంగంలోకి దింపుతారు. అసలు సెల్‌ఫోన్స్ మాయం కావడానికి, జరిగిన హత్యలకు నెగిటివ్ ఫోర్స్ ఉన్న పక్షిరాజు అనే ప్రొఫెసర్ కారణం అని తెలుస్తుంది. ఇంతకు ప్రొఫెసర్ నెగిటివ్ ఎనర్జీగ ఎలా మారుతాడు? అసలు సెల్‌ఫోన్స్‌కు, పక్షిరాజుకు ఉన్న సంబంధం ఏంటనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
ప్లస్ పాయింట్స్:
- రజనీకాంత్, అక్షయ్‌కుమార్
- గ్రాఫిక్స్
- గ్రాండియర్
- నేపథ్య సంగీతం
- సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్:
- కథలో ట్విస్ట్‌లు పెద్దగా లేవు
- ఎంటర్‌టైన్‌మెంట్ పార్ట్ కూడా తక్కువే
- ఎమోషన్స్ పెద్ద ఎఫెక్టివ్‌గా లేవు
విశ్లేషణ:
సాంకేతికత అనేది మనిషి మనుగడకు ఉపయోగపడాలి కానీ.. నాశనానికి కాదు.. అలాగే ఈ భూమి కేవలం మానవులకే పరిమితం కాదు. చాలా జీవరాశులున్నాయి. ఒకదానికొకటి లింకుతో మానవ జీవనం సాగాలి. తన జీవనం కోసం ఇతర జీవ రాశులను అంతం చేయకూడదనే కాన్సెప్ట్‌తోనే దర్శకుడు శంకర్ సినిమా కథను తయారు చేసుకున్నాడు. ఓ రకంగా చెప్పాలంటే రివేంజ్ డ్రామా. ఓ మెసేజ్‌ను కమర్షియల్ పంథాలో చెప్పడంలో శంకర్ సూపర్బ్. ఈసారి సెల్‌ఫోన్స్‌పై శంకర్ ప్రధానంగా కథను తయారు చేసుకున్నాడు. సెల్‌ఫోన్స్ కారణంగా వచ్చే రేడియేషన్ వల్ల ఎలాంటి నష్టాలుంటాయనే దాన్ని శంకర్ ఈ చిత్రంలో చెప్పడానికి ప్రయత్నించాడు. దానికి రజనీకాంత్ వంటి స్టార్ తోడయ్యాడు. రజనీ నాలుగు షేడ్స్‌లో తనదైన స్టైలిష్ నటనను కనపరిచాడు. ముఖ్యంగా వెర్షన్ 2.0లో రజనీ స్టైల్, డైలాగ్ డెలివరీ అన్నీ ఆకట్టుకుంటాయి. అలాగే వెర్షన్ 3.0 మినీ రోబోట్‌గా రజనీ ప్రేక్షకులకు కనిపించి ఓ సర్‌ప్రైజ్ ఇచ్చాడు.
ఫస్టాఫ్ విషయానికి వస్తే సినిమా అసలేం జరిగిందనే విషయాన్ని ఆసక్తికరంగా నడపడంలో దర్శకుడు సినిమాను సక్సెస్ అయ్యాడు. ప్రేక్షకుడిని కథలోకి తీసుకెళ్లడంలో శంకర్ ఎక్కువ టైమ్ తీసుకోలేదు. సెల్‌ఫోన్స్ మాయం కావడం, హత్యలు జరగడం.. వరకు నార్మల్‌గానే ఉన్నా.. చిట్టి ఎంట్రీతో ఫస్టాఫ్ స్పీడు అందుకుంటుంది. ఇక సెకండాఫ్ విషయానికి వచ్చేసరికి అసలు ప్రతి మనిషికి ఓ ఓరా ఉంటుంది. అయితే అది నెగిటివ్ ఎనర్జీగా ఎలా మారింది. ముఖ్యంగా పక్షులు బావుండాలని కోరుకునే పక్షిరాజు ఎవరూ ఎదిరించలేదని నెగటివ్ ఎనర్జీగా ఎలా ఎదిగాడనే అంశాన్ని ఆసక్తికరంగానే చూపాడు. విజువల్ గ్రాండియర్‌గా సినిమా రన్ అయ్యింది.
అయితే దర్శకుడు శంకర్ చెప్పిన కథలో ఏం అద్భుతం లేదు. సరే ఎమోషన్ ఏమైనా ఉందా? అంటే అదీ లేదు. కేవలం సాంకేతికతతో ప్రేక్షకుడిని కట్టిపడేయాలని దర్శకుడు ప్రయత్నించాడనే సంగతి ప్రేక్షకుడికి అర్థమవుతుంది. ఇక రజనీకాంత్ అసలా? డూపా అని అర్థం కానీ సన్నివేశాలు సెకండాఫ్‌లో కనపడతాయి. అక్షయ్ అసలు రూపంలో కనపడే పార్ట్ తక్కువ. అంత మాత్రానికి అతన్ని ఎందుకు తీసుకోవాలో దర్శకుడికే తెలియాలి. సినిమాపై హైప్ పెంచడం కాకపోతే మరేంటనే కోపం కూడా వస్తుంది. దర్శకుడు ఎక్కువగా యాక్షన్ పార్ట్, గ్రాఫిక్స్‌పైన శ్రద్ధ పెట్టాడు. రోబో సమయంలో శంకర్ తెరపై చూపించిన విజువల్స్ ఔరా! అనిపించాయి. అయితే.. ఈ ఎనిమిదేళ్ల గ్యాప్‌ప్రేక్షకుడు టెక్నికల్‌గా ఎంతో ఎదిగాడు. శంకర్ చూపించిన టెక్నాలజీ ప్రేక్షకుడి సంభ్రమాశ్చర్యాలకు లోను చేయదనైతే చెప్పొచ్చు. ఎమీజాక్సన్ పార్ట్ పరిమితమే. మిగతా నటీనటులు పెద్దగా ఎవరికీ తెలియదు. మిగిలిన పాత్రలన్నీ తేలిపోయాయి. ఐశ్వర్యారాయ్ అతిథి పాత్రలో కనపడుతుందనడం అబద్ధమని తేలిపోయింది.
బోటమ్ లైన్:
2.0 రీలోడెడ్ వెర్షన్ సాంకేతికంగా ఓకే కానీ .. ఇప్పుడు ప్రేక్షకుడు హాలీవుడ్ సినిమాలను ఎక్కువగా చూస్తున్నాడు. కాబట్టి అంత గొప్పగా అనిపించదు. అలాగే పార్ట్ వన్ రోబో కంటే ఈ సినిమాలోఎమోషన్ పార్ట్ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు తక్కువే.
Read '2.0' Movie Review in English
- Read in English