భారత్‌లో విజృంభిస్తున్న కరోనా.. ఒక్క ఆగస్ట్‌‌లోనే 20 లక్షల కేసులు..

  • IndiaGlitz, [Tuesday,September 01 2020]

భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. నెల నెలకూ కేసుల సంఖ్య రెట్టింపు స్థాయిలో నమోదవుతున్నాయి. ఒక నెల వ్యవధిని మాత్రమే పరిగణలోకి తీసుకుంటే ఆగస్టు ఒక్క నెలలో భారత్‌లో నమోదైనన్ని కేసులు ప్రపంచంలో ఏ దేశంలోనూ నమోదు కాకపోవడం గమనార్హం. ఒక్క ఆగస్ట్ నెలలోనే భారత్‌లో 20 లక్షల కేసులు నమోదవడం భయాందోళనలు కలిగిస్తోంది. అత్యధిక తీవ్రత ఉన్న అమెరికాను సైతం ఆగస్ట్ నెలలో భారత్ దాటేసింది. అయితే దేశంలో రికవరీ రేటు ఎక్కువగా ఉండటం కాస్త ఊరట కలిగిస్తోంది.

తాజాగా హెల్త్ బులిటెన్‌ను కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 69,921 కరోనా‌ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా కేసుల సంఖ్య మొత్తంగా 36,91,167కి చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 819 మంది మృతి చెందగా.. మొత్తంగా ఇప్పటి వరకూ 65,288 మంది మృతి చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 7,85,996 మంది చికిత్స పొందుతుండగా.. 28,39,883 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

కాగా.. కోవిడ్ మరణాల విషయానికి వస్తే ప్రపంచంలో అమెరికా, బ్రెజిల్ దేశాల్లో ఎక్కువగా సంభవిస్తున్నాయి. ఆగస్ట్ నెలలో అమెరికాలో 31వేల మరణాలు సంభవించగా.. బ్రెజిల్‌లో 30 వేల మరణాలు.. భారత్‌లో 28 వేల మరణాలు సంభవించాయి. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 76 శాతానికి పైగా ఉంది. ప్రస్తుతం భారత్‌లో కరోనా మరణాల రేటు 1.7 శాతం కొనసాగుతోంది.