Ind vs Aus T20 : మ్యాచ్ టికెట్ల కోసం ఎగబడ్డ అభిమానులు, జింఖానా గ్రౌండ్లో అభిమానులు, పోలీసులకు గాయాలు
- IndiaGlitz, [Thursday,September 22 2022]
ఈ నెల 25న హైదరాబాద్ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్న భారత్ - ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్‌కు సంబంధించి టికెట్ల విక్రయాలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ప్రతిరోజూ క్రికెట్ అభిమానులు టికెట్ల కోసం కిలోమీటర్ల మేర క్యూలలో గంటల తరబడి ఎదురుచూస్తున్నారు. టికెట్లను బ్లాక్‌లో విక్రయిస్తున్నారంటూ అభిమానులు హెచ్‌సీఏపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. అయితే ఈరోజు పరిస్ధితి మాత్రం ఉద్రిక్తతకు దారితీసింది. సికింద్రాబాద్‌లోని జింఖానా మైదానంలో గురువారం టికెట్లు విక్రయించేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఏర్పాట్లు చేసింది.
ఒక్కసారిగా మెయిన్ గేట్ నుంచి దూసుకొచ్చిన అభిమానులు :
టికెట్ల కోసం అభిమానులు తెల్లవారుజాము నుంచే క్యూకట్టారు. ప్యారడైజ్ జంక్షన్ నుంచి జింఖానా వరకు క్యూలైన్లో కిక్కిరిసిపోయింది. అయితే అభిమానులు భారీగా తరలిరావడంతో వారిని నియంత్రించడం పోలీసుల వల్ల కాలేదు. ఈ నేపథ్యంలో మెయిన్ గేట్ వైప్ నుంచి అభిమానులు ఒక్కసారిగా దూసుకురావడంతో వారిని కంట్రోల్ చేసుందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతిచెందగా.. 20 మందికిపైగా అస్వస్థతకు గురై స్పృహ తప్పిపడిపోయారు. పది మంది పోలీసులకు కూడా గాయాలైనట్లుగా తెలుస్తోంది. గాయపడిన వారిలో యువతులు కూడా వున్నారు. వీరిందరిని వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.
సాంకేతిక లోపం:
మరోవైపు టికెట్ల విక్రయాలకు సంబంధించి జింఖానా గ్రౌండ్లో ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద సాంకేతిక లోపం తలెత్తడంతో నిర్వాహకులు, అభిమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో ఆన్లైన్ పేమెంట్స్ కాకుండా నగదు చెల్లింపులను మాత్రమే అనుమతిస్తున్నారు. దీనిపై అభిమానులు మండిపడుతున్నారు. టికెట్ల విక్రయానికి సంబంధించి హెచ్‌సీఏ సరైన ఏర్పాట్లు చేయలేదని భగ్గుమంటున్నారు. ఇప్పటికే మ్యాచ్‌కు సంబంధించిన పాస్‌ల విషయంలోనూ హెచ్‌సీఏపై ఆరోపణలు వస్తున్నాయి. ప్రధానంగా వీఐపీ పాస్‌ల కోసం పెద్దల ఒత్తిళ్లు వుండటంతో హెచ్‌సీఏకి తలబొప్పి కడుతోంది.