Kedarnath chopper crash : ఉత్తరాఖండ్‌లో కుప్పకూలిన భక్తుల హెలికాఫ్టర్... ఆరుగురు దుర్మరణం

  • IndiaGlitz, [Tuesday,October 18 2022]

దేవభూమి ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కేదార్‌నాథ్ యాత్రికులతో వెళ్తోన్న ఓ హెలికాఫ్టర్ మంగళవారం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఫటా హెలిప్యాడ్ నుంచి యాత్రికులను తీసుకెళ్తుండగా.. కేదార్‌నాథ్ ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలోని గరుడ్ ఛాటి ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీస్, రెవెన్యూ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల్లో ఇద్దరు పైలట్లు కాగా.. నలుగురు యాత్రికులుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం వుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

రెండు వారాల క్రితం లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. 32 మంది మృతి:

ఇకపోతే.. రెండు వారాల క్రితం కూడా ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. నాటి ఘటనలో 32 మంది దుర్మరణం పాలవ్వగా.. 20 మందికి తీవ్రగాయాలయ్యాయి. 55 మందితో ప్రయాణిస్తోన్న బస్సు పౌరీ జిల్లాలోని ధూమకోట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిమ్ది గ్రామ సమీపంలో అదుపుతప్పి... లోతైన లోయలోకి దూసుకెళ్లింది. 500 మీటర్ల లోతైన లోయలో బస్సు పడటంతో ప్రమాద తీవ్రత అధికంగా వుంది. హరిద్వార్ జిల్లాలోని లాల్‌ధాంగ్ నుంచి పౌరీ జిల్లా బీర్‌ఖాల్ బ్లాక్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. వీరంతా ఓ పెళ్లికి వెళ్తూ మృత్యువాతపడ్డారు.