తెలంగాణలోకి ఎంటరైన ఒమిక్రాన్.. హైదరాబాద్‌లో రెండు కేసులు గుర్తింపు, సర్కార్ అలర్ట్
Send us your feedback to audioarticles@vaarta.com
దక్షిణాఫ్రికాలో పుట్టి ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తెలంగాణ లోకి ప్రవేశించింది. రాష్ట్రంలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ బుధవారం ప్రకటించింది. కెన్యా, సోమాలియా నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులకు కొవిడ్ పాజిటివ్ వచ్చిందని... వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపగా ఒమిక్రాన్‌గా నిర్ధారణ అయిందని తెలంగాణ డీహెచ్ శ్రీనివాసరావు వెల్లడించారు.
12వ తేదీ కెన్యాకు చెందిన 24 ఏళ్ల మహిళ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చారని.. ఆమెకు నిర్వహించిన జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలో ఒమిక్రాన్ నిర్ధారణ అయినట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్ టోలిచౌకిలో ఆమెను గుర్తించి గచ్చిబౌలిలోని టిమ్స్‌కు తరలించినట్లు చెప్పారు. ఒమిక్రాన్ సోకిన మహిళకు సన్నిహితంగా ఉన్న ఇద్దరు కుటుంబ సభ్యుల శాంపిల్స్ కూడా సేకరించినట్లు శ్రీనివాసరావు తెలిపారు. అలాగే సోమాలియాకు చెందిన 23 ఏళ్ల వ్యక్తికి కూడా ఒమిక్రాన్ సోకినట్లు డీహెచ్ వెల్లడించారు.
అయితే ప్రజలెవరూ ఆందోళన పడాల్సిన పనిలేదని.. కోవిడ్ మార్గదర్శకాలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని శ్రీనివాసరావు సూచించారు. వీరిద్దరితో పాటు మరో వ్యక్తికి ఎయిర్‌పోర్టులో పాజిటివ్‌గా తేలిందని.. ఆ వ్యక్తి పశ్చిమ బెంగాల్‌కు చెందిన వ్యక్తి అని రాష్ట్రంలోకి ప్రవేశించలేదని ఆయన చెప్పారు. వీటితో కలిపి దేశంలో ఇప్పటి వరకు ఒమిక్రాన్ కేసుల సంఖ్య 61కి చేరుకుంది. అత్యథికంగా మహారాష్ట్రలో 28 మంది బాధితులు వుండటం ఆందోళన కలిగిస్తోంది. భారత్‌లో తాజాగా 6,984 కొత్త కరోనా కేసులు వెలుగుచూశాయి. ఇందులో ఒక్క కేరళలోనే 3,377 కేసులు వున్నాయి. 24 గంటల్లో 247 మంది కోవిడ్ వల్ల ప్రాణాలు కోల్పోయారు. నిన్న దేశవ్యాప్తంగా 68.8 లక్షల మంది కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments