జగన్ ఎఫెక్ట్: నవ్వుతూ మంత్రి పదవులు వదిలేస్తాం!!
- IndiaGlitz, [Tuesday,January 28 2020]
ఏపీ శాసన మండలిని రద్దు చేస్తూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఊహించని రీతిలో సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కేబినెట్, అసెంబ్లీ ఈ రద్దును ఆమోదించగా ఇక మిగిలింది లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి ఆమోదాలే. అయితే ఈ రద్దును కేంద్రం ఆమోదం తెలిపితే.. జగన్ కేబినెట్ ఇద్దరు మంత్రులు ఔట్ అవుతారు. వారిలో ఒకరు మోపిదేవి వెంకటరమణ కాగా మరొకరు పిల్లి సుభాష్ చంద్రబోస్. వీరిద్దరూ సీనియర్లే.. ఇద్దరూ కూడా 2019 ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. దీంతో ఎమ్మెల్సీ పదవులివ్వడమే కాకుండా మంత్రి పదవులు సైతం జగన్ కట్టబెట్టారు.
ఈ పదవులు వరించబోతున్నాయా!?
వీరిద్దరికీ మంత్రి పదవులు పోవడంతో.. ఆ స్థానంలో ఎవరిని భర్తీ చేస్తారు..? ఔటయ్యే వీరిద్దరికి జగన్ ఏమని హామీ ఇచ్చారు..? వారికి ప్రత్యామ్నాయమేంటి..? అనేది నిశితంగానే చర్చించి జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారట. సోమవారం జరిగిన కేబినెట్ భేటీలో.. ‘పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణారావు అన్న ఇద్దరూ నాకు అత్యంత ఆప్తులు, సన్నిహితులు కూడా. వాళ్లిద్దరూ నాకోసం ఎన్నో కష్టాలు పడ్డారు, నష్టాలను కూడా భరించారు. వారికి ఎప్పటికీ అన్యాయం చేయను.. చేయబోను’ అని హామీ ఇచ్చారట. అయితే.. త్వరలో వీరిద్దర్నీ రాజ్యసభకు పంపే యోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. లేదా నామినేటెడ్ పదవిని కట్టబెడతారని తెలుస్తోంది. అంటే ఇద్దరూ ‘పెద్దల సభ’కు వెళ్లబోతున్నారన్న మాట.
ఆనందంగానే..!
మంత్రి పదవులు ఊడిపోతాయ్ కదా మీ పరిస్థితేంటి..? అని తాజాగా మీడియా ఈ ఇద్దర్నీ అడగ్గా.. ‘ఆనందంగా పదవులు వదిలేసుకుంటాం’ అని చెప్పుకొచ్చారు. ‘మండలిలో సభ్యులుగా ఉండటం ఆవేదనను కలిగిస్తోంది. గతంలో ఎన్టీ రామారావు సీఎంగా ఉన్న వేళ, స్వల్ప ప్రయోజనాల కోసం రామోజీరావు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించి, మండలిని రద్దు చేశారు.. కానీ ఇప్పుడు విస్తృత ప్రయోజనాల కోసం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు తప్పుడు నిర్ణయాలను సరిదిద్దేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు’ అని పిల్లి సుభాష్ చెప్పడం విశేషమని చెప్పుకోవచ్చు.
నేను సిద్ధమే..!
‘మండలిలో సభ్యులుగా ఉన్న మేం మంత్రి పదవులు వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. పెద్దల పేరు చెప్పుకుని అభివృద్ధికి అడ్డంకులు సృష్టించే ఇటువంటి సభ ఉండటానికి వీల్లేదు.. జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. చంద్రబాబు చేస్తున్న పనుల వల్ల చట్ట సభల్లోని సభ్యులు ప్రజల ముందు తల దించుకుని నిలబడాల్సి వస్తోంది’ అని మోపిదేవి చెప్పుకొచ్చారు.