Download App

2 Countries Review

హీరోగా మారిన త‌ర్వాత సునీల్ హీరోగా నిల‌దొక్కుకోవ‌డానికి గ‌ట్టి ప్ర‌య‌త్నాలే చేస్తున్నాడు. క‌మెడియ‌న్‌గా వ‌స్త‌న్న అవ‌కాశాల‌ను ప‌క్క‌న పెట్టి పూర్తిగా హీరోగా పేరు తెచ్చుకోవ‌డానికి ఫోక‌స్ పెట్టాడు. అందాల రాముడు, పూల రంగ‌డు, మ‌ర్యాద రామ‌న్న వంటి స‌క్సెస్‌లు వ‌చ్చిన త‌ర్వాత సునీల్‌కు ఆ రేంజ్ స‌క్సెస్‌లు రాలేదు. అయితే సునీల్ ప్ర‌య‌త్న లోపం లేకుండా కృషి చేస్తున్నాడు. అందులో భాగంగా మ‌ల‌యాళంలో విజ‌య‌వంత‌మైన `2 కంట్రీస్‌` చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో రీమేక్ చేశాడు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే `జై బోలో తెలంగాణ‌`  త‌ర్వాత ద‌ర్శ‌క‌త్వం చేయ‌ని ఎన్‌.శంక‌ర్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం చేయ‌డంతో పాటు నిర్మాత‌గా కూడా ఈ సినిమాను రూపొందించ‌డం విశేషం. మ‌రి ఈ సినిమాతోనైనా సునీల్ స‌క్సెస్ అందుకున్నాడా?  లేదా?  తెలుసుకోవాలంటే క‌థ‌లోకి ఓ లుక్కేద్దాం..

క‌థ‌:

ఉల్లాస్ కుమార్ (సునీల్‌) జీవితంలో డ‌బ్బు కోసం ఏదైనా చేసే ర‌కం. డ‌బ్బు సంపాదించాల‌న్న‌ది మాత్ర‌మే అత‌ని ధ్యేయం. అలాగ‌ని అత‌నేం బ్యాడ్ కేర‌క్ట‌ర్ కాదు. అదో ల‌క్ష‌ణం అంతే. అత‌ని ఆలోచ‌న‌ల‌కు త‌గ్గ‌ట్టే ల‌య (మ‌నీషా రాజ్‌) దొరుకుతుంది. ఉల్లాస్‌కుమార్‌, ల‌య మ‌ధ్య చిన్న‌ప్ప‌టి అనుబంధం ఉంటుంది. ఆ జ్ఞాప‌కాలే వాళ్ల పెళ్లికి కార‌ణ‌మ‌వుతాయి. తీరా పెళ్ల‌య్యాక ల‌య గురించి ఉల్లాస్ కుమార్‌కి ఓ నిజం తెలుస్తుంది. అది ఏంటి? ఉల్లాస్ కుమార్ దాని వ‌ల్ల ఎలా ఫీల‌య్యాడు? అత‌ని ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు వ‌చ్చిందా?  ల‌య జీవితంలో మార్పు వ‌చ్చిందా?  నిత్యం ఎన్నో ఇబ్బందులున్న‌ప్ప‌టికీ క‌లిసిమెలిసి సాగాల్సిన కాపురం స‌జావుగానే సాగిందా?  లేదా? వ‌ంటివ‌న్నీ ఆస‌క్తిక‌రం.

ప్ల‌స్ పాయింట్లు:

గ‌త కొన్ని చిత్రాల్లో సునీల్ ముఖం పీల్చుకుపోయిన‌ట్టు క‌నిపించేది. కానీ ఈ సినిమాలో మాత్రం సునీల్ పాత సునీల్‌లాగా నిండుగా క‌నిపించారు. మ‌నీషారాజ్ తాగుబోతు అమ్మాయిగా చక్క‌గానే క‌నిపించింది. న‌రేష్‌కి ఇంగ్లిష్ స్లాంగ్ సూట్ అయింది. బాగా త‌గ్గి స‌న్న‌గా ఝాన్సీ కొత్త‌గా క‌నిపించింది. కెమెరా ప‌నిత‌నం బావుంది. లొకేష‌న్లు, ఇంటీరియ‌ర్ డెక‌రేష‌న్లు కొత్త‌గా క‌నిపించాయి.

మైన‌స్ పాయింట్లు:

ఎటొచ్చీ రాజార‌వీంద్ర ప‌క్క‌న సంజ‌నను చూడ్డానికే  కాసింత ఇబ్బందిగా అనిపించింది. ప్రాస కోసం వాడే డైలాగులు కొన్నిచోట్ల విసుగు తెప్పించాయి. సినిమా ఆద్యంతం న‌వ్వులు తెప్పిస్తున్నామ‌ని చిత్ర యూనిట్ భావించినా, థియేట‌ర్లో న‌వ్వులు మాత్రం క‌నిపించ‌లేదు. పాట‌లు వ‌చ్చిన ప్ర‌తిసారీ ప్ర‌తి సీటు నుంచీ జ‌నాలు లేచి వెళ్తూనే ఉన్నారు. సంగీతం పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. గోపీచంద్ మార్క్ ఇందులో క‌నిపించ‌లేదు. పృథ్విరాజ్ త‌ర‌హా పాత్ర‌లు ఇంత‌కు ముందు బ్ర‌హ్మానందం చాలా సార్లు చేశారు. అమ్మ నిజం.. నాన్న అబ‌ద్ధం అని చెప్పే డైలాగులు కాస్త ఎబ్బెట్టుగా అనిపించాయి.

విశ్లేష‌ణ‌:

కొన్ని సినిమాలు మ‌ల‌యాళం వాళ్ల‌కు కొత్త‌గా అనిపించి, ఆడేయ‌వ‌చ్చు. అమ్మాయి మద్యానికి అల‌వాటు ప‌డింది.. అబ్బాయి డ‌బ్బుకు అల‌వాటు ప‌డ్డాడు అనే కాన్సెప్ట్ తో తెర‌కెక్కిన ఈ సినిమా మ‌ల‌యాళ ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేసింది. అక్క‌డ హిట్ అయిన ఈ సినిమాను తెలుగులో తెర‌కెక్కించారు. ఎన్‌.శంక‌ర్ పెట్టిన ఖ‌ర్చు తెర‌మీద క‌నిపిస్తూనే ఉంది. ఎటొచ్చీ ఆక‌ట్టుకునే ఎమోష‌న్సే మిస్ అయ్యాయి. రీరికార్డింగ్ కూడా ఎమోష‌న్స్ ని ఎలివేట్ చేయ‌లేక‌పోయింది.  సునీల్‌, శ్రీనివాస‌రెడ్డి క‌లిపి కామెడీ చేయ‌డానికి ప్ర‌య‌త్నించినా అది ఫ‌లించ‌లేదు.  హీరో ఫ్యామిలీ, ప‌టేల్ సార్ పేరుతో సాయాజీ షిండే గ్యాంగ్ ప్రేక్ష‌కుల‌ను ఏమాత్రం ఆక‌ట్టుకోలేదు. ఓవ‌రాల్‌గా సినిమా చూసే ప్రేక్ష‌కుడికి మ‌రో క‌మ‌ర్షియ‌ల్ సినిమాను చూసిన ఫీలింగే క‌లుగుతుంది.

బాట‌మ్ లైన్‌: 2 కంట్రీస్‌.. అంత ఆస‌క్తిగా ఏం లేదు!

2 Countries Movie Review in English

Rating : 2.0 / 5.0