చిరు 'బావగారూ బాగున్నారా'కి 18 ఏళ్లు

  • IndiaGlitz, [Saturday,April 09 2016]

వినోదానికి పెద్ద‌పీట వేస్తూ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రాల్లో 'బావ‌గారూ బాగున్నారా'ది ప్ర‌త్యేక స్థానం. బ్ర‌హ్మానందం కాంబినేష‌న్‌లో ప్ర‌థ‌మార్థంని.. కోట శ్రీ‌నివాస‌రావు, శ్రీ‌హ‌రి కాంబినేష‌న్‌లో ద్వితీయార్థంని ర‌క్తి క‌ట్టిస్తూ చిరు చేసిన కామెడీ.. సినిమా విజ‌యానికి ఎంతో ప్ల‌స్ అయింది. రంభ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రాన్ని అంజ‌నా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై కె.నాగ‌బాబు నిర్మించాడు. ఇదివ‌ర‌కు చిరంజీవి హీరోగా నాగ‌బాబు నిర్మించిన చిత్రాలు ఆశించిన విజ‌యాల‌ను సాధించ‌క‌పోయినా.. ఆ లోటుని భ‌ర్తీ చేసిందీ చిత్ర విజ‌యం.

స్వ‌ర‌బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ‌కి ట‌ర్నింగ్ పాయింట్‌గా నిలిచిన ఈ సినిమాలోని పాట‌ల‌న్నీ ప్ర‌జాద‌ర‌ణ పొందాయి. ముఖ్యంగా 'ఆంటీ కూతురా అమ్మో అప్స‌రా', 'సారీ సారీ' పాట‌లు ఇప్ప‌టికీ ఎక్క‌డో చోట వినిపి స్తుంటాయి. చిరు, మ‌ణి కాంబినేష‌న్‌లో మ‌రో ప‌ది మ్యూజిక‌ల్ హిట్స్ రావ‌డానికి పునాదిగా నిలిచిందీ చిత్రం. జ‌యంత్ సి.ప‌రాన్జీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన 'బావ‌గారూ బాగున్నారా'.. 1998లో ఏప్రిల్ 9న విడుద‌లైంది. అంటే.. నేటితో ఈ సినిమా రిలీజై 18 వ‌సంతాల‌ను పూర్తిచేసుకుంటోంద‌న్న‌మాట‌.