ఘోర విమాన ప్రమాదం.. 170 మంది దుర్మరణం

  • IndiaGlitz, [Wednesday,January 08 2020]

ఇరాన్‌లో ఇవాళ రెండు ఘోర ఘటనలు జరిగాయి. బుషెహర్ అణు కర్మాగారం సమీపంలో ఇవాళ భూకంపం చోటుచేసుకుంది. రాజధాని టెహ్రాన్ సమీపంలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 170 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. ఉక్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌‌లైన్స్‌కి చెందిన బోయింగ్ విమానం టెహ్రాన్‌లోని ఇమామ్ ఖోమైనీ ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరిన కొద్ది సేపటికే ఘోరం జరిగింది. కాగా.. ఈ ప్రమాదానికి కారణం విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడమేనని ఇరాన్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.

ఇదిలా ఉంటే.. ఈ ఘటనాస్థలిలో విమాన శకలాలు, ఛిద్రమైన మృతదేహాలతో భయానక పరిస్థితిగా మారింది. ప్రమాదంలో మరణించింది 170 మంది కొన్ని మీడియా సంస్థలు వెల్లడించగా.. 180 మంది మృతి చెందారని మరికొన్ని మీడియా సంస్థలు వెల్లడిస్తున్నాయ్. కాగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.