Coronavirus: దేశంలో విస్తరిస్తోన్న కరోనా.. కొత్తగా 16,159 మందికి పాజిటివ్, పెరుగుతోన్న యాక్టీవ్ కేసులు
- IndiaGlitz, [Wednesday,July 06 2022]
ప్రపంచవ్యాప్తంగా నెమ్మదించింది అనుకున్న కరోనా మహమ్మారి మరోసారి పంజా విసిరేందుకు సిద్ధమైందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఫ్రాన్స్, ఇటలీ, చైనా, హాంకాంగ్ లతో పాటు పలు యూరప్ దేశాల్లో కోవిడ్ మళ్లీ తిరగబెడుతోంది. ఇటీవలి కాలంలో కేసులు పెరుగుతుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అటు భారత్ లోనూ గత కొన్నిరోజులుగా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా దేశంలో గడిచిన 24 గంటల్లో 16,159 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీటితో కలిపి భారతదేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,35,47,809కి చేరుకుంది.
దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య లక్షపైనే:
ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,15,212కి పెరిగాయని కేంద్రం తెలిపింది. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 29 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరితో కలిపి భారత్ లో ఇప్పటి వరకు కోవిడ్ మరణాల సంఖ్య 5,25,270కి చేరుకున్నాయి. అటు జాతీయ స్థాయిలో కరోనా రికవరీ రేటు 98.53 శాతం వుండగా... రోజువారీ పాజిటివ్ రేటు 3.56 శాతంగా నమోదైంది. అటు సోమవారం దేశంలో 9,95,810 మంది టీకాలు తీసుకోగా.. ఇప్పటి వరకు భారత్ లో పంపిణీ చేసిన టీకాల సంఖ్య 1,98,20,86,763కి చేరుకున్నాయి.
తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు:
తెలంగాణ రాష్ట్రంలోనూ గత కొన్నిరోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. మంగళవారం కొత్తగా 552 కొత్త కేసులు నమోదవ్వగా.. మొత్తం యాక్టీవ్ కేసుల సంఖ్య 4,753కి చేరుకున్నాయి. నిన్నటి కేసుల్లో ఒక్క హైదరాబాద్ పరిధిలోనే 316 కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ను తప్పనిసరి చేసింది. అలాగే మందులు, ఆసుపత్రుల్లో సదుపాయాలపై దృష్టి పెట్టింది.