ఏపీలో కరోనా బీభత్సం.. ఒక్కరోజే 161 కేసులు

  • IndiaGlitz, [Saturday,June 06 2020]

ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ కరోనా బీభత్సం సృష్టిస్తోంది. మే నెల మొత్తం తక్కువ సంఖ్యలోనే కేసులు నమోదయ్యాయి. అయితే జూన్ ప్రారంభం నుంచి మాత్రం పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయే తప్ప తగ్గట్లేదు. అయితే అధికారులు మాత్రం ఎక్కువ సంఖ్యలో టెస్ట్‌లు చేస్తున్నారు గనుక కేసులు కూడా అంతేరీతిలో పెరుగుతున్నాయని చెబుతున్నారు. శనివారం నాడు ఒక్కరోజే 161 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ మీడియా బులెటిన్‌లో పేర్కొంది. ఇవాళ నమోదైన కొత్త కేసులతో కలిపితే మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3588కు చేరుకుంది. ఇందులో ఇప్పటి వరకూ 2323 మంది డిశ్చార్జి కాగా.. 73 మంది చనిపోయారని ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం 9 గంటల వరకూ రాష్ట్రంలో కరోనాతో ఎవరూ చనిపోలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1192గా ఉండగా.. కొత్తగా 29 మంది కరోనాను జయించి డిశ్చార్జ్ అయ్యారు.

ఏపీలో ఇలా ఎందుకు..!?

కాగా.. ఈ మొత్తం కేసుల్లో విదేశాల నుంచి ఏపీకి వచ్చిన 131 మందికి పాజిటివ్ అని తేలింది. వారిలోలో నలుగురు కోలుకుని డిశ్చార్జ్ కాగా ప్రస్తుతం 127 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చిన వారిలో 741 మందికి పాజిటివ్ అని తేలగా.. వారిలో 467 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆ 467 మందిలో 16 మందిని ఇవాళ డిశ్చార్జి చేసినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి వచ్చి యాక్టివ్‌గా ఉన్న వారి కేసుల సంఖ్య మొత్తం 594. రోజురోజుకూ కరోనా టెస్టులు పెరగడంతో పాటు యాక్టివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతున్నాయని రాష్ట్ర అధికారుల వాదన. మరి ప్రపంచ వ్యా్ప్తంగా, ఇండియాలో.. తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎప్పుడు తగ్గుతాయో వేచి చూడాలి.