'నువ్వు నాకు న‌చ్చావ్‌'కి 16 ఏళ్లు

  • IndiaGlitz, [Wednesday,September 06 2017]

గ‌త రెండు ద‌శాబ్దాల కాలంలో.. కుటుంబ స‌మేతంగా చూడ‌దగ్గ సినిమాలు ప‌రిమిత సంఖ్య‌లోనే రూపొందాయి. అలాంటి వాటిలో క్లాసిక్‌గా నిలిచిన చిత్రం 'నువ్వు నాకు న‌చ్చావ్‌'.

కుటుంబ విలువ‌లు, స్నేహం, ప్రేమ‌, పెళ్లి.. ఇలా అన్ని అంశాల‌ను స్పృశిస్తూ తెర‌కెక్కిన ఈ చిత్రం నిడివి 3 గంట‌ల‌కి పైగానే. అయితే.. చూసే ప్రేక్ష‌కుల‌కు అలాంటి ఫీలింగే ఉండదు. క‌థానాయ‌కుడు వెంక‌టేష్ పాత్ర చిత్ర‌ణ, హావ‌భావాలు.. చాలా కొత్త‌గా ఉంటాయి ఈ సినిమాలో. తెలుగు తెర‌పై నెం.1 హీరోయిన్‌గా కొన్నాళ్ల పాటు రాణించిన ఆర్తి అగ‌ర్వాల్‌కి ఇదే మొద‌టి సినిమా.


కె.విజ‌య్‌భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం, త్రివిక్ర‌మ్ మాట‌లు, కోటి సంగీతం, సిరివెన్నెల సాహిత్యం, సునీల్, బ్ర‌హ్మానందం కామెడీ, ప్ర‌కాష్ రాజ్‌, చంద్ర‌మోహ‌న్‌, సుహాసిని, సుధ‌, బేబి సుదీప, ఎమ్మెస్ నారాయ‌ణ త‌దిత‌రుల న‌ట‌న‌.. ఇలా చెప్పుకుంటూ పోతే ప్ర‌తి అంశంలోనూ ఈ సినిమాకి మంచి మార్కులు ప‌డ‌తాయి. సెప్టెంబ‌ర్ 6, 2001న విడుద‌లైన 'నువ్వు నాకు న‌చ్చావ్' నేటితో 16 ఏళ్లు పూర్తిచేసుకుంటోంది.