మొన్న అరకు.. నిన్న కర్నూలు.. నేడు మహారాష్ట్ర.. అన్నీ ఘోరాలే..!

  • IndiaGlitz, [Monday,February 15 2021]

ఇటీవలి కాలంలో దేశంలో వరుస రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్న అరకులో మినీ బస్సు 100 అడుగులో పడిపోయిన విషయం మరువక ముందే.. నిన్న కర్నూలులో ఘోర ప్రమాదం జరిగింది. అరకులో జరిగిన ఘోర ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందగా.. కర్నూలులో జరిగిన రోడ్డు ప్రమాదంలో 14 మంది దుర్మరణం పాలయ్యారు. నేటి(సోమవారం) తెల్లవారుజామున మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 16 మంది దుర్మరణం పాలయ్యారు.

మహారాష్ట్రలోని జల్‌గావ్‌లో ఆదివారం అర్థరాత్రి దాటాక ఈ ప్రమాదం సంభవించింది. అరటి లోడుతో వెళుతున్న ట్రక్కు జల్‌గావ్ జిల్లాలోని కింగ్వాన్ వద్దకు రాగానే బోల్తాపడింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం.. మహారాష్ట్రలోని ధూలే నుంచి రేవర్ ప్రాంతానికి అరటి లోడుతో ట్రక్కు ప్రయాణిస్తోంది. దీనిలో మొత్తం 21 మంది కార్మికులు కూడా ప్రయాణిస్తున్నారు. యావల్ తాలూకాలోని కింగ్వాన్ సమీపంలోకి రాగానే బోల్తా పడటంతో... 16 మంది మృతి దుర్మరణం పాలయ్యారు. మిగిలిన వారంతా తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా అభోదా, కర్హలా, రావేరా జిల్లాలకు చెందిన కార్మికులుగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.