16 Every Detail Counts Review
సస్పెన్స్ థ్రిల్లర్స్, హార్రర్ కామెడి చిత్రాలకు తెలుగు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది. ఇలాంటి తరుణంలో తమిళంలో విజయవంతమైన సస్పెన్స్ థ్రిల్లర్ ధృవంగల్ 16 చిత్రాన్ని తెలుగులో `16 ఎవ్విరి డిటెల్ కౌంట్స్`. అనే పేరుతో తెలుగులో విడుదల చేశారు. తెలుగులో గత సంవత్సరం బిచ్చగాడు వంటి అనువాద చిత్రంతో సెన్సేషనల్ హిట్ కొట్టిన శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తుండటం, తమిళంలో చిన్న చిత్రంగా విడుదలై సెన్సేషనల్ అయిన సినిమా కావడంతో ధృవంగల్ 16 తెలుగు అనువాదంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఏ మేర ఆకట్టుకుందో తెలుసుకోవాలంటే సినిమా కథ తెలుసుకుందాం...
కథ:
దీపక్ అనే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ తన మనోగతం చెప్పడం స్టార్ట్ చేయడంతో సినిమా మొదలవుతుంది. దీపక్(రహమాన్) దగ్గర పనిచేసిన రాజయ్య అనే హెడ్ కానిస్టేబుల్ తన కొడుకుకు పోలీస్ ఆఫీసర్ పడే కష్ట నష్టాలు గురించి చెప్పమని, దీపక్ దగ్గరకు పంపుతాడు. డ్యూటీలో జరిగిన యాక్సిడెంట్‌లో కాలు కోల్పోయిన దీపక్‌ను చూడటానికి వచ్చిన రాజయ్య కొడుకు, దీపక్ కాలుకేమైందని అడగడంతో అసలు కథ స్టార్ట్ అవుతుంది. దీపక్ తను అటెండ్ చేసి, ప్రమాదానికి గురైన చివరి కేసు వివరాలను చెప్పడంతో సినిమా కథ ప్రారంభం అవుతుంది.
దీపక్ పనిచేసే ఏరియాలోని పార్క్ దగ్గర క్రిష్ అనే వ్యక్తి తుపాకీతో కాల్చుకుని చనిపోతాడు. అదే సమయంలో పార్క్ సమీపంలో ఓ కారు గుద్దడంతో ఓ వ్యక్తి చనిపోతాడు. ఈ రెండు ఘటనలు జరిగిన రోజునే పార్క్ సమీపంలోని ఆదిత్య ఆపార్ట్‌మెంట్‌లో శృతి అనే అమ్మాయి కనపడకుండా పోతుంది. ఈ మూడు కేసులకు ఏదో దగ్గర సంబంధం ఉందని భావించిన దీపక్, అసిస్టెంట్, కొత్తగా డ్యూటీలో వచ్చిన కొత్త కానిస్టేబుల్ గౌతమ్‌తో కలిసి కేసును అన్వేషించడం మొదలు పెడతాడు. అసలు దీపక్ కేసులో ఎంత దూరం వెళతాడు? అనేక చిక్కుముడులున్న కేసును దీపక్ పరిష్కరించాడా? అసలు దీపక్‌కు ప్రమాదం ఎలా జరిగింది? హంతకుడెవరు? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే...
ప్లస్ పాయింట్స్:
- కథ, కథనం
- దర్శకత్వం
- సినిమాటోగ్రఫీ
- బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
- నటీనటుల పనితీరు
మైనస్ పాయింట్స్:
- స్లో నెరేషన్
- మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకోకపోవచ్చు
సమీక్ష:
ఈ సినిమా నటీనటుల విషయానికి వస్తే సీనియర్ నటుడు రహమాన్ మినహా మిగతా ప్రధాన పాత్రధారులందరూ కొత్తవాళ్ళే అయినా వారి వారి పాత్రలకు తగిన విధంగా చక్కటి నటనను ప్రదర్శించారు. ముఖ్యంగా రహమాన్ నటన చాలా చక్కగా ఉంది. రహమాన్ తప్ప మరెవ్వరూ దీపక్ పాత్రను చేయలేరనేంతలా రహమాన్ పాత్రలో ఒదిగిపోయాడు. ఇక సాంకేతికంగా చూస్తే ఇందులో మార్కులు వేయాల్సింది.. దర్శకుడు కార్తీక్ నరేన్‌కే. సింపుల్ పాయింట్‌ను బేస్ చేసుకుని, దాని ఆధారంగా కథను రాసుకున్న తీరు, గ్రిప్ మిస్ కాకుండా సన్నివేశాలను నడిపించిన విధానానికి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేం. ప్రతి పాత్రకు ముఖ్యతం ఇస్తూ, ప్రాత్రకు ప్రాముఖ్యతను ఇస్తూ, అసలు హత్యలు ఎవరు చేశారనే విషయాన్ని ఎక్కడా రివీల్ చేయకుండా సస్పెన్స్‌ను చివరి వరకు మెయిన్ టెయిన్ చేశాడు దర్శకుడు కార్తీక్ నరేన్. దర్శకత్వ ప్రతిభకు జాక్సె బెజోయ్ సంగీతం, సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ అదనపు బలంగా చేరాయి. బెజోయ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బావుంది. సినిమా నెరేషన్ స్లోగా ఉండటం, ఇలాంటి స్క్రీన్‌ప్లే మూవీస్ మాస్ ఆడియెన్స్‌ను ఏ మేర ఆకట్టుకుంటాయనేదే విషయంలో చిన్న సందేహం కూడా ఏర్పడింది. అయితే మొత్తం మీద అన్నీ శాఖలను దర్శకుడు మెనేజ్ చేసుకుంటూ చక్కటి స్క్రీన్‌ప్లేతో సినిమా ప్రేక్షకుడికి సీట్ ఎడ్జ్‌లో కూర్చొనేలా చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.
బోటమ్ లైన్: 19 ఎవ్విరి డిటైల్ కౌంట్స్.. గుడ్ స్క్రీన్ ప్లేతో ఆకట్టుకున్న సీడ్ ఎడ్జ్ థ్రిల్లర్
16 Every Detail Counts English Version Review
- Read in English