మహమ్మారి కమ్ముకొస్తుంటే.. కొవిడ్ నిబంధనలు గాలికి, 1500 మంది కలిసి కోతి అంత్యక్రియలు
- IndiaGlitz, [Wednesday,January 12 2022]
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ 19 విశ్వరూపం ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజూ భారీ స్థాయిలో కేసులతో యూరప్, అమెరికా, ఆఫ్రికా ఖండాలు వణికిపోతున్నాయి. మనదేశంలోనూ రోజువారీ కేసులు లక్షకు పెరిగాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలను అమలు చేస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూలు, 50 శాతం ఆక్యూపెన్సీతో థియేటర్లు నడపాలని ప్రభుత్వం ఆదేశించింది. వీటితో పాటు అంత్యక్రియలు, వివాహాది శుభకార్యాలకు సైతం పరిమితి విధిస్తున్నాయి.
ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లోని ఓ గ్రామంలో కోతి అంత్యక్రియలకు భారీగా జనం హాజరవ్వడం కలకలం రేపుతోంది. కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తూ.. ఏకంగా 1500 మంది అంత్యక్రియలకు హాజరైనట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వివరాల్లోకి వెళితే.. రాజ్‌గఢ్ జిల్లా దాలుపురా గ్రామంలో ఓ వానరం మృతి చెందగా గత నెల 29వ తేదీన దానికి సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు గ్రామస్తులు. హరిసింగ్ అనే ఓ వ్యక్తి ఏకంగా గుండు చేయించుకొని కోతికి దహన సంస్కారాలు నిర్వహించాడు. ఇంతటితో ఆగకుండా గ్రామస్థులందరూ చందాలు వేసుకుని మరి 1500 మందికి సరిపడా భోజనాలు వండి, వడ్డించారు.
రాష్ట్రంలో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కొద్దిరోజుల క్రితమే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పలు నిబంధనలు విధించింది. ఈ నేపథ్యంలోనే కోతి అంత్యక్రియలు జరగడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కరోనా నిబంధనలు ఉల్లంఘించడం కింద కేసులు నమోదు చేసి.. ఇద్దరిని అరెస్టు చేశారు పోలీసులు.