నుమాయిష్‌లో 150 దుకాణాల బుగ్గి.. 100 కోట్లు నష్టం
- IndiaGlitz, [Thursday,January 31 2019]
హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్స్ గ్రౌండ్లో బుధవారం రాత్రి సంభవించిన అగ్ని్ప్రమాదానికి 150 దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మరో 250 దుకాణాలు పాక్షికంగా దహనమయ్యాయి. షాపుల్లో చిన్నపాటి వస్తువు కూడా మిగల్లేదు. మొత్తం వంద కోట్ల రూపాయిలు ఆస్తినష్టం జరిగిందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. కాగా తీవ్ర అస్వస్థత మినహా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తేల్చారు. బుధవారం రాత్రి 8:00 గంటల ప్రాంతంలో నుమాయిష్ ఎగ్జిబిషన్స్‌లో చెలరేగిన మంటలు అర్థరాత్రి 2గంటల వరకూ కూడా అదుపులోకి రాలేదంటే ఎంత పెద్ద అగ్నిప్రమాదమో అర్థం చేసుకోవచ్చు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో షాపు సంబంధికులు, సందర్శకులు ఎటు వెళ్లాలో తెలియక ఒక్కసారిగా పరుగులు తీయడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. దీంతో 20మందికి అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. క్షతగాత్రులంతా నాంపల్లిలోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
కాగా.. ఈ ఏడాది నుమాయిష్ (అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన)కు మొత్తం 2,500 స్టాల్స్ వచ్చినట్లు సమాచారం. దాదాపు 400 స్టాళ్లకు పైగా కాలిపోయాయి. అలెర్టయిన ఫైరింగ్ సిబ్బంది, పోలీసులు, నిర్వాహకులు మిగిలిన షాపులకు మంటలు వ్యాపించకుండా జాగ్రత్తపడటంతో పెనుముప్పు తప్పినట్లైంది. మంటల థాటికి స్టాళ్లు తగలబడుతుంటే.. ఆ స్టాళ్ల యజమానుల ఆవేదన ఆ పెరుమాళ్లకే ఎరుగక. పాపం.. వారిని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. జనవరి 1న ప్రారంభమైన 79వ నుమాయిష్ నెలరోజుల పాటు సజావుగానే సాగింది. బహుశా ఈ రేంజ్లో భాగ్యనగరంలో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం ఇదే మొదటిసారేమో.
అగ్ని ప్రమాదానికి అసలు కారణమిదీ..
సరిగ్గా రాత్రి 8:00 గంటల ప్రాంతంలో నుమాయిష్‌లోని వనితా మహావిద్యాలయ సమీపంలో గల జైళ్లు, ఆంధ్రాబ్యాంక్ స్టాళ్ల సమీపం నుంచి చిన్నపాటి మంటలు వచ్చాయి. అయితే ఆ షాపుల పక్కనే హెచ్‌పీ గ్యాస్, పిస్టా హౌజ్ స్టాళ్లు ఉండటంతో మంటలు చెలరేగాయి. గ్యాస్ సిలిండర్లకు మంటలు అంటుకోని ఆకాశన్నంటే రీతిలో ఒక్కసారిగా మంటలు వ్యాపించకోవడంతో అసలు ఏం చేయాలో దిక్కుతోచ యజమానులు పరుగులు తీశారు. ఇలా జనాలు చూస్తుండగానే ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 400 స్టాళ్లు తగలబడ్డాయి.
సకాలంలో ఫైరింజన్లు వచ్చుంటే..!
మొదట చిన్నపాటి మంటలు వ్యాపించినప్పుడే స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. అయితే మెయిన్‌గేట్ బయటున్న ఫైరింజన్ ఘటనాస్థలికి చేరుకోవడానికి సుమారు అరగంటకు పైగా సమయం పట్టిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అంతేకాదు ఆ ఫైరింజన్లో నీళ్లు తక్కువగానే ఉన్నాయి. దీంతో నిర్వాహకులు, షాపుల యజమానులు ఫైర్ సిబ్బందితో వాగ్వాదానికి దిగినట్లుగా తెలుస్తోంది. అయితే ఫైర్ సిబ్బంది మాత్రం ఓపికతో సందర్శకులను, పలు షాపుల్లోని వస్తువులను మూడు గేట్ల ద్వారా బయటికి తరలించారు.
కాగా ఫైరింజన్లో నీళ్లు ఉండుంటే పరిస్థితి ఇలా ఉండేది కాదని నిర్వాహకులు, షాపుల యజమానులు గగ్గోలు పెడుతున్నారు. అప్పుడప్పుడే హోం మంత్రి మహమూద్ అలీ ఘటనాస్థలికి రావడంతో ఆయన్ను చుట్టుముట్టిన షాపుల ఓనర్లు తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలి లేకుంటే ఆత్మహత్యలు తప్పదు అని పలు షాపుల యజమానులు కన్నీరుమున్నీరవుతున్నారు. అయితే ఈ నుమాయిష్ బాధితులకు ప్రభుత్వం ఏ మేరకు సాయం చేసి ఆదుకుంటుందో వేచి చూడాలి.