చరణ్ కి 15, తారక్‌కి 25
- IndiaGlitz, [Sunday,July 07 2019]
రామ్‌చరణ్‌కి రూ.15కోట్లు, తారక్‌కి రూ.25కోట్లు అని ఫిక్స్ చేశాడట రాజమౌళి .ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్, తారక్ కలిసి 'ఆర్ ఆర్ ఆర్'లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చరణ్ కి రూ.15కోట్లు, తారక్ కి రూ.25కోట్లు ఏంటి? అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం. అది వారి రెమ్యూనరేషన్ అయితే కాదు. వారిద్దరి ఫస్ట్ షాట్ సన్నివేశాల చిత్రీకరణకు అయ్యే ఖర్చు. ఒక్కొక్కరి ఓపెనింగ్ సన్నివేశాలతో ఎన్నో చిన్న సినిమాలు తీయొచ్చన్నమాట. అలాంటిది ఒన్లీ వారిద్దరి ఇంట్రడక్షన్ సన్నివేశాలకు మాత్రమే అంత ఖర్చుపెడుతున్నట్టు వినికిడి.
ఈ చిత్రంలో చరణ్ చారిత్రక అల్లూరి సీతారామరాజు పాత్రలోనూ, తారక్ కొమరంభీమ్‌గానూ నటిస్తున్న సంగతి తెలిసిందే. చారిత్రక పురుషుల జీవితాల్లోని అదృశ్యమైన రోజులకు సంబంధించి ఊహాత్మక కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. విజయేంద్రప్రసాద్ ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు.
కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. చరణ్ ఓపెనింగ్ సన్నివేశాన్ని ఇప్పటికే తెరకెక్కించారట. తారక్ సన్నివేశాలను మరికొన్ని వారాల్లోనే తెరకెక్కించనున్నారట. హైదరాబాద్, గుజరాత్, పుణెలో ఎక్కువ భాగాన్ని చిత్రీకరించనున్నారు.
తారక్ సరసన నటించే నాయిక గురించి ఇంకా ఏ విషయమూ బయటకు రాలేదు. కానీ వచ్చే ఏడాది జులై 30న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.