Chandrababu Naidu:36 గంటల ఉత్కంఠకు తెర .. చంద్రబాబుకు బిగ్‌షాక్, 14 రోజుల రిమాండ్ విధించిన కోర్ట్
- IndiaGlitz, [Sunday,September 10 2023]
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏసీబీ కోర్ట్ షాకిచ్చింది. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో ఆయనకు న్యాయస్థానం 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించి 36 గంటల పాటు సాగిన సస్పెన్స్‌కు తెరదించింది. ఈ నెల 22 వరకు చంద్రబాబు నాయుడుకు రిమాండ్ విధిస్తూ జస్టిస్ హిమబిందు తీర్పు వెలువరించారు. దీంతో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. ఈ రాత్రి ఆయనను సిట్ ఆఫీసుకు తరలించి, రేపు ఉదయం రాజమండ్రి జైలుకు తరలించే అవకాశం వుందని సమాచారం. కోర్ట్ తీర్పుతో టీడీపీ శ్రేణులు దిగ్భ్రాంతికి గురయ్యాయి. కోర్ట్ తీర్పు నేపథ్యంలో పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా అప్రమత్తమయ్యారు.
అంతకుముందు చంద్రబాబు అరెస్ట్‌పై విజయవాడలోని ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. చంద్రబాబు తరపున సుప్రీంకోర్ట్ సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ లూథ్రా, సీఐడీ తరపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన వాదనలు.. మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.
చంద్రబాబును ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు : సిద్ధార్ధ లూథ్రా
ఈ కేసులో సెక్షన్ 409 పెట్టడం సరికాదని సిద్ధార్థ లూథ్రా వాదించారు. ఇలాంటి సెక్షన్ పెట్టాలంటే సరైన సాక్ష్యాధారాలు వుండాలని, రిమాండ్ రిపోర్ట్‌ను తిరస్కరించాలంటూ నోటీసు ఇచ్చారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి తిరస్కరణ వాదనలకు అవకాశం కల్పించారు. చంద్రబాబును ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని సిద్ధార్ధ వాదించారు. గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేశారని.. సీఐడీ అధికారుల కాల్ డేటాను కోర్టుకు సమర్పించేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు.
చంద్రబాబును కస్టడీకి అనుమతించండి : ఏఏజీ
సీఐడీ తరపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు. అరెస్ట్ చేసిన 24 గంటల్లోపే చంద్రబాబును కోర్టులో ప్రవేశపెట్టామని.. ఈ కేసులో 8 మందిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ కేసులో 2021లో ఎఫ్ఐఆర్ నమోదైందని.. చంద్రబాబును విచారించేందుకు గాను 15 రోజుల కస్టడీకి అనుమతించాలని సీఐడీ కోరింది. చంద్రబాబుపై సీఐడీ 34 అభియోగాలు నమోదు చేసిందని.. రిమాండ్ రిపోర్టులో అన్ని అంశాలూ చేర్చామని పొన్నవోలు వాదించారు. చంద్రబాబు ఏ తప్పూ చేయలేదని ఆయన తరపు లాయర్లు చెప్పడం లేదని, ఎంతసేపూ సాంకేతిక ఆధారాల గురించే మాట్లాడుతున్నారని సుధాకర్ రెడ్డి కోర్ట్ దృష్టికి తీసుకెళ్లారు.
చంద్రబాబు సీఎం కాదు.. ఎమ్మెల్యే మాత్రమే : ఏఏజీ
చంద్రబాబును అరెస్ట్ చేయడానికి గవర్నర్ అనుమతి అవసరం లేదని, స్పీకర్‌కు సమాచారం ఇస్తే సరిపోతుందని పొన్నవోలు తెలిపారు. అరెస్ట్ అయిన మూడు నెలల లోపు గవర్నర్‌కు ఎప్పుడైనా సమాచారం ఇవ్వొచ్చన్నారు. ఆయన వాస్తవ హోదా ఎమ్మెల్యే మాత్రమేనని పొన్నవోలు స్పష్టం చేశారు. తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారిని ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే అరెస్ట్ చేయొచ్చని ఏఏజీ కోర్ట్ దృష్టికి తీసుకెళ్లారు. సీఎం హోదాలో నిధుల విడుదలకు చంద్రబాబు ఆదేశించారని.. రాజ్యాంగ పదవిలో వుండి అవినీతికి పాల్పడ్డారని పొన్నవోలు తెలిపారు.