కర్నూల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. 13మంది మృతి
Send us your feedback to audioarticles@vaarta.com
కర్నూలు జిల్లా వెల్దుర్తి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం సాయంత్రం హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై వోల్వో బస్సు-తుఫాన్ వాహనం, టూ వీలర్ బైక్ ఢీ కొన్నాయి. బైక్ను తప్పించబోయిన తుఫాన్.. వోల్వో బస్సును ఢీకొన్నది. ఈ ఘోర ప్రమాదంలో 13 మంది ఘటనాస్థలిలోనే తుదిశ్వాస విడిచారు. కాగా అటు బస్సులోని.. ఇటు తుఫాన్లోని పలువురు ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుుసుకున్న స్థానికులు, పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం గాయపడిన వారంతా సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉంటే మరో నలుగురు వ్యక్తులు జీపులోనే ఇరుక్కుపోయినట్లు సమాచారం. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
పెళ్లి చూపులకు వెళ్లి ఇంటికి తిరిగొస్తుండగా ఈ ఘోరం జరిగింది. మృతులు తెలంగాణకు చెందిన గద్వాల జిల్లా పామవరం వాసులుగా పోలీసులు గుర్తించారు. అయితే ప్రమాదంలో చనిపోయిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారా..? కాదా..? అనే విషయాలు తెలియాల్సి ఉంది. కాగా.. హైదరాబాద్ నుంచి మణిపాల్ (కర్ణాటక)కు వోల్వా బస్సు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగింది..? ఎవరి తప్పిదంతో ఈ ఘోరం జరిగింది..? అని ఆరా తీసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఇదిలా ఉంటే మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ప్రమాదం గురించి తెలుసుకున్న గద్వాల జిల్లా పామవరం గ్రామస్థులు కన్నీరుమున్నీరవుతున్నారు. శుభకార్యానికి వెళ్లొస్తుండగా.. ఇలా జరిగిందేంటి..? అని గ్రామస్థులు కంటతడిపెడుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments