కోవిడ్ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. 13 మంది మృతి
Send us your feedback to audioarticles@vaarta.com
అసలే కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు ఉంటాయో.. పోతాయో తెలియని స్థితిలో జనం బిక్కుబిక్కుమంటూ కాలం గడిపేస్తున్నారు. పాజిటివ్ వస్తే ప్రాణాలు నిలుపుకోవడం కోసం ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. కానీ ఆ ఆసుపత్రుల నిర్లక్ష్యం కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆక్సిజన్ అందక 22 మంది రోగులు ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువక ముందే.. తాజాగా మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా వసాయిలోని విజయ్ వల్లభ్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. విజయ్ వల్లభ్ కోవిడ్ ఆస్పత్రిలోని ఐసీయూలో మంటలు చెలరేగడంతో 13 మంది రోగులు మృతి చెందారు. క్షతగాత్రులను దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో.. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిపమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా.. బుధవారం ఇదే మహారాష్ట్రలోని ఓ కోవిడ్ ఆసుపత్రిలో ఆక్సిజన్ ట్యాంకర్ లీక్ అవడంతో రోగులకు ప్రాణవాయువు అందించడంలో అంతరాయం ఏర్పడింది. దీంతో 22 మంది కోవిడ్ రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న డాక్టర్ జకీర్ హుస్సేన్ ఆసుపత్రిలో బుధవారం జరిగింది. ఈ ఆసుపత్రిలో దాదాపు 150 మంది రోగులు వెంటిలేటర్, ఆక్సిజన్ సరఫరాపై ఆధారపడి ఉన్నారు.బుధవారం మధ్యాహ్నం ఆక్సిజన్ ట్యాంకర్లో ఆక్సిజన్‌ను వేరొక ఆక్సిజన్ ట్యాంకర్ ద్వారా నింపుతున్న సమయంలో ప్రాణవాయువు బయటకు పెల్లుబికింది. ఈ క్రమంలోనే దాదాపు అరగంట పాటు ఆసుపత్రిలోని రోగులకు ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న 22 మంది రోగులు ప్రాణాలు కోల్పోయినట్టు ఆరోగ్యమంత్రి రాజేష్ తోపే వెల్లడించారు.
వరుస ఘటనలు జరుగుతున్నప్పటికీ మహారాష్ట్ర సర్కారు మాత్రం కళ్లు తెరవడం లేదు. అసలే కోవిడ్ కేసుల్లో ఈ రాష్ట్రం అగ్ర స్థానంలో కొనసాగుతోంది. ఈ సమయంలో ప్రజల ప్రాణాలను ఎలా కాపాడుకోవాలనే విషయంపై దృష్టి సారించాలి. కానీ జరుగుతున్న వరుస ఘటనలను చూస్తుంటే మాత్రం ప్రభుత్వం తమకు ఏమాత్రం పట్టనట్టు వ్యవహరిస్తోందని అర్థమవుతోంది. ఇలా పదుల సంఖ్యలో రోగులు ఆసుపత్రుల నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోతుంటే నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం సరికాదని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout