118 Review
కొత్త దర్శకులకు ఎప్పుడూ ప్రూవ్ చేసుకోవాలనే తపన ఎక్కువగా ఉంటుంది. అలాంటి కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చే హీరోల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జయాపజయాలతో సంబంధం లేకుండా ఏదో కొత్తగా చేయాలని నిజాయతీతో చేసే ప్రయత్నం తెరపై మనకు కనపడుతుంటుంది. అలాంటి హీరోల్లో నందమూరి కల్యాణ్ రామ్ ఒకరు. ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో కొత్త దర్శకులకే అవకాశం ఇచ్చిన హీరో కల్యాణ్ రామ్ సినిమాటోగ్రాఫర్ కె.వి.గుహన్‌కి డైరెక్షన్‌లో చేసిన సినిమా `118`. ఇప్పుడున్న ట్రెండ్‌లో కొత్త కాన్సెప్ట్‌లను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. మరి సస్పెన్స్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 118 ఎలా ఆకట్టుకుందో తెలుసుకోవాలంటే సినిమా కథేంటో చూద్దాం...
కథ:
ఏ పని అయినా మొదలుపెడితే పూర్తి చేయడం గౌతమ్ (కల్యాణ్‌రామ్)కున్న అలవాటు. అతని ప్రొఫెషన్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం. మేనమామ కూతురు మేఘ(షాలినీ పాండే)తో లవ్‌లో ఉంటాడు. వారిద్దరికీ పెద్దలు పెళ్లి కూడా అరేంజ్ చేస్తారు. ఈ క్రమంలో ప్యారడైజ్ రిసార్ట్ కు వెళ్తాడు గౌతమ్. అక్కడ అతనికి ఓ కల వస్తుంది. రెండోసారి కూడా అదే గదిలో అలాగే వస్తుంది. మామూలుగానే పరిశోధన చేసే తత్వం ఉన్న గౌతమ్‌ని ఆ కల మరింతగా డిస్టర్బ్ చేస్తుంది. అయినా అది కలో, నిజమో తేల్చుకోలేని పరిస్థితిలో ఉంటాడు. ఆ క్రమంలోనే ఆ కలలో వచ్చిన కొన్ని విషయాలు అతనికి ఎదురవుతుంటాయి. వాటిని పట్టుకుని తన కలలో చూసిన విషయాలను విజువలైజ్ చేసుకుంటూ వెళ్తాడు. ఆ క్రమంలోనే అతనికి ఆద్య, ఎస్తర్, ప్రభావతి, మూర్తిగారు వంటివారందరూ ఎదురవుతుంటారు. వారందరికీ, గౌతమ్‌కీ ఉన్న సంబంధం ఏంటి? ఇంతకీ గౌతమ్‌కి వచ్చింది కలా? నిజమా? వంటివన్నీ ఆసక్తికరమైన అంశాలు
ప్లస్ పాయింట్లు:
తనకు వచ్చిన కలను వెతుక్కుంటూ వెళ్లడం అనే కాన్సెప్ట్ బాగానే ఉంది. అలాగే మెడిసన్‌ను ఉపయోగంలోకి తీసుకురావడానికి ముందు కొందరి మీద ప్రయోగిస్తారనే విషయం కూడా ఇంతకు ముందు తెలిసిందే. ఈ రెండు విషయాలను లింక్ చేస్తూ పాయింట్ రాసుకోవడం వరకు బాగానే ఉంది. అలాగే తెరకెక్కించే తీరులో కూడా కన్‌ఫ్యూజన్ లేదు. ఏదో జరిగింది.. కానీ ఏం జరిగిందనే విషయాన్ని మాత్రం చెప్పకుండా సీక్రెట్‌గా మెయిన్ టెయిన్ చేస్తూ వెళ్లిన సన్నివేశాలు బావున్నాయి. కల్యాణ్‌రామ్, నివేదా థామస్, షాలినీ పాండే, హరితేజ తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ముఖ్యంగా నివేదా చివరి 20 నిమిషాలే కనపడినా పాత్రకు తనదైన నటనతో ప్రాణం పోసింది. చందమామే పాట వినడానికి బావుంది. తీసిన విధానం కూడా బావుంది. సినిమాటోగ్రఫీకి కూడా మార్కులు పడతాయి. శేఖర్ చంద్ర అందించిన నేపథ్య సంగీతం నెటివిటీకి తగ్గట్లు (అంటే హాలీవుడ్ సినిమాల నుండి తీసుకున్నట్లుగా కాకుండా) సూట్ అయ్యింది.
మైనస్ పాయింట్లు:
సినిమాలో చమ్మక్ చంద్ర, ప్రభాస్ శ్రీను ఉన్నప్పటికీ కామెడీ పండలేదు. కథ ఫ్లోలో ఉన్న సీరియస్‌కన్నా కల్యాణ్‌రామ్ ఫేస్‌లో సీరియస్‌నెస్ ఎక్కువగా కనిపిస్తుంది. సెకండాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్ ఏపిసోడ్ మరి ఎక్కువైన ఫీల్ వస్తుంది. పర్టికులర్ జోనర్ మూవీగా నిలిచిపోతుంది.
విశ్లేషణ:
కలను వెంటాడుతూ వెళ్లిన అతనికి నిజాలు తెలియడమనే కాన్సెప్ట్ కల్యాణ్‌రామ్‌కి కొత్తే. కలలో వచ్చిన కథ తాలూకు టెన్షన్‌ని తన లైఫ్‌లో చూపించడంలోనూ సక్సెస్ అయ్యాడు. తొలిసగం వరకు ఆ టెన్సన్ ప్రేక్షకుల్లోనూ ఉంది. కానీ సెకండాఫ్‌లోనే సడన్‌గా ఎక్కడో డిస్కనట్ అయిన ఫీలింగ్ వస్తుంది. ప్రతి విషయం గురించీ హీరో టెన్షన్ పడటం, ఉన్నట్టుండి సడన్‌గా క్లియర్ చేసుకోవడం వంటివి కనిపిస్తాయి. హీరోకి కల వస్తే అర్థం ఉందనుకోవచ్చు. అతని ఫ్రెండ్ అతనికి ఆమెను కలవమని పని పురమాయించాడు కాబట్టి, ఏదో బీరకాయపీచు రిలేషన్‌ని చూపించారని అనుకోవచ్చు. కానీ తమిళనాడులో ఉన్న అతనికి, ముస్లిం పిల్లాడికి కథ ఎందుకు వచ్చినట్టు? ఈ సన్నివేశాల్లో అర్థం ఉండదు. ప్రభావతి పాత్రను, బ్రేస్‌లెట్‌ను చూపించడం కోసమే ఇంత దూరం, ఇన్ని పాత్రలను కల్పించినట్టు అర్థమవుతుంది. సినిమాలో ఉన్న ఒకే ఒక పాట కూడా సందర్భం లేకుండా ఏదో ఉండాలి కాబట్టి ఉన్నట్టనిపిస్తుంది. సీన్లలోనూ కొత్తదనం కనిపించదు. నివేదా థామస్ ఎపిసోడ్‌కన్నా, హీరోకి కల్లోకి వచ్చే ఎడిటెడ్ వెర్షనే థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. 118 గదిలో జరిగిన ఎపిసోడ్‌ని ఇంకాస్త ఇంటెన్స్ తో తీస్తే బావుండేదేమో. అక్కడ రీరికార్డింగ్‌లోనూ ఇంకాస్త మోతాదు పెంచి ఉంటే బావుండేది. పెద్ద మెడికల్ రీసెర్చి కంపెనీ వ్యక్తి అంత పెద్ద వ్యవహారాన్ని డీల్ చేసిన విధానం కూడా ఎఫెక్టివ్‌గా అనిపించదు. నిర్మాణ విలువలు బావున్నాయి. బ్లేడు డైలాగు, మొదలుపెట్టిన పనిని సగంలో వదిలేయాలంటే చిరాకు అనే డైలాగు బావున్నాయి. అలాగే యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ బావుంది.
బాటమ్ లైన్: '118'... ఎంగేజింగ్ సస్పెన్స్ థ్రిల్లర్
Read '118' Movie Review in English
- Read in English