సికింద్రాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం: 11 మంది బీహార్ కూలీలు సజీవ దహనం.. మోడీ, కేసీఆర్ దిగ్భ్రాంతి
Send us your feedback to audioarticles@vaarta.com
సికింద్రాబాద్ బోయగూడలో బుధవారం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. టింబర్, తుక్కు గోదాంలో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకుని 11 మంది సజీవ దహనమయ్యారు. ఐడీహెచ్ కాలనీలోని స్క్రాప్ దుకాణంలో 15 మంది కార్మికులు మంగళవారం రాత్రి నిద్రపోయారు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ జరగడంతో భారీగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన కార్మికులు బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే మంటలు చుట్టుముట్టడంతో ఇద్దరు కార్మికులు ప్రమాదం నుంచి బయట పడగా.. మిగిలిన 13 మంది అగ్నికీలల్లో చిక్కుకుపోయారు. వీరిలో 11 మంది సజీవ దహనమవ్వగా.. మరో ఇద్దరి ఆచూకీ తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని ఐదు ఫైరింజన్లతో అతి కష్టం మీద మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలను అగ్నిమాపక సిబ్బంది వెలికి తీశారు. వీరంతా బిహార్‌కు చెందిన వలస కూలీలుగా గుర్తించారు. బిహార్‌లోని చాప్రా జిల్లా జక్కువు గ్రామానికి చెందిన వీరంతా బతుకు తెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చారు. మృతులను సికిందర్ (40), బిట్టు (23), సత్యేందర్ (35), గోలు (28), దామోదర్ (27), రాజేశ్ (25), దినేశ్ (35), రాజు (25) చింటు (27), దీపక్ (26), పంకజ్ (26)గా గుర్తించారు.
మరోవైపు ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో భారీగా ప్రాణనష్టం చోటు చేసుకోవడం విచారకరమన్న ప్రధాని మోడీ.. మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి ఒక్కొక్కరికి రూ.2 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎం కేసీఆర్ కూడా రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. మృతదేహాలను బీహార్‌లోని వారి స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్‌ను కేసీఆర్ ఆదేశించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com