10th Class Results: ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల
- IndiaGlitz, [Monday,April 22 2024]
ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. విజయవాడలో ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ ఫలితాలను విడుదల చేశారు. మార్చి 18 నుంచి 30 వరకు నిర్వహించిన పరీక్షలకు దాదాపు 7లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 6.23 లక్షలు, గతేడాది ఫెయిలై రీఎన్రోల్ అయిన విద్యార్ధులు లక్షకు పైగా ఉన్నారు. ఇందులో బాలుర సంఖ్య 3,17,939.. బాలికల సంఖ్య 3,05,153 ఉంది. ఇక మొత్తం 3,473 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు.
ఈ ఫలితాలను bse.ap.gov.in అధికారిక వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా రెగ్యూలర్ విద్యార్థులు 6,16,617 మందిలో 5,34,574 (86.69శాతం) మంది పాస్ అయ్యారు. ఇందులో బాలురు 84.32శాతం, బాలికలు 89.17శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది కూడా బాలికలే అధిక సంఖ్యలో ఉత్తీర్ణత సాధించడం విశేషం. అదే విధంగా 11,645 పాఠశాలల నుంచి పరీక్షలు రాయగా.. 2,803 పాఠశాలల్లో 100శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 17 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాకపోవడం గమనార్హం.
అత్యధిక ఉత్తీర్ణత సాధించి మొదటి స్థానంలో పార్వతీపురం మన్యం జిల్లా నిలవగా.. చివరి స్థానంలో కర్నూల్ జిల్లా నిలిచింది. పార్వతీపురం మన్యం జిల్లాలో 96.37శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా.. కర్నూల్ జిల్లాలో 62.47 శాతం మంది విద్యార్థులు మాత్రమే పాస్ అయ్యారు. కాగా రాష్ట్రంలో మార్చి 18న ఫస్డ్ లాంగ్వేజ్ పేపర్-1, మార్చి 19న సెకండ్ లాంగ్వేజ్, మార్చి 20న ఇంగ్లిష్, మార్చి 22న మ్యాథమెటిక్స్, మార్చి 23న ఫిజికల్ సైన్స్, మార్చి 26న బయాలజీ, మార్చి 27న సోషల్ స్టడీస్ పరీక్షలు నిర్వహించగా.. మార్చి 28, 30 తేదీల్లో వొకేషనల్ పరీక్షలు నిర్వహించారు.