ఓకే బంగారం విజయం తర్వాత దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా నటించిన మలయాళ చిత్రాన్ని తెలుగులోనూ అదే పేరుతో `100 డేస్ ఆఫ్ లవ్` విడుదల చేస్తున్నారు. ఎస్ ఎస్ సీ మూవీస్ సమర్ఫణలో ఎస్. వెంకట్ రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ సంస్థ రెండు రాష్ట్రాల్లోనూ విడుదల చేస్తోంది. జీనస్ మొహ్మద్ దర్శకత్వం వహిస్తు్న ఈ సినిమాకు సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం బుధవారం హైదరాబాద్ లో జరిగింది. లహరి మ్యూజిక్ ద్వారా విడుదలైన ఈ చిత్ర ఆడియో సీడీని నితిన్ విడుదల చేసి, మొదటి సీడీని నానికి అందించారు.
నితిన్ మాట్లాడుతూ `` నిత్యామీనన్‌తో కలిసి ఇప్పటికి రెండు సినిమాలు చేశాను. నాని కూడా రెండు సినిమాలు చేశారు. ఇప్పుడు నిత్యామీనన్ పెద్ద స్టార్ రేంజ్‌కి ఎదిగింది. మేం ముగ్గురం కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా చేయాలని ఉంది. అది కూడా వెంకట్‌కే చేయాలని ఉంది. ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. ప్రొడక్షన్ మేనేజర్ నుంచి డిస్ట్రిబ్యూటర్‌గా, ఇప్పుడు ఈ సినిమా నిర్మాత స్థాయికి ఎదిగాడు వెంకట్. తనకి ఈ సినిమా పెద్ద హిట్ కావాలి`` అని అన్నారు.
నాని మాట్లాడుతూ `` నిత్యా గురించి ఎవరు ఎక్కడ మాట్లాడినా నాకు గర్వంగా ఉంటుంది. తను మా `అలా మొదలైంది` సినిమాతో తెలుగులో కెరీర్‌ని మొదలుపెట్టింది. ఈ సినిమా మలయాళ ట్రైలర్ విడుదలైనప్పుడు చూశాను. చాలా క్యూట్‌గా అనిపించింది. సబ్ టైటిల్స్ తో చూద్దామని అనుకున్నా. ఇప్పుడు తెలుగులో హాయిగా చూడొచ్చు. సినిమా సంగీతం బావుంది. దర్శకుడు చిన్నవాడైనా చాలా కొత్తగా తెరకెక్కించారనిపిస్తోంది. నిత్యా, నేను, నితిన్ కలిసి ఓ సినిమా చేస్తే నిజంగానే చాలా బావుంటుంది`` అని తెలిపారు.
నిత్యామీనన్ మాట్లాడుతూ `` ఈ సినిమాను ఫ్రెండ్లీగా చేశాను. ఈ సినిమా టీమ్ అంతా నాకు మంచి ఫ్రెండ్స్. తెలుగు ఆడియన్స్ కి ఈ చిత్రం చాలా కొత్తగా ఉంటుంది. కలర్స్, సెట్స్, షాట్స్, మ్యూజిక్ ఇలా ప్రతిదీ చాలా వైవిధ్యంగా ఆలోచించి చేశాం. హాలీవుడ్ స్థాయిలో ఉంటుందీ సినిమా. తప్పకుండా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది. వెంకట్‌కి ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. ఇందులో హృదయం అనే పాట నాకు చాలా ఇష్టం. పాటలు మలయాళంలో కన్నా తెలుగులో ఇంకా బాగా ఉన్నాయి`` అని చెప్పారు.
కృష్ణచైతన్య మాట్లాడుతూ `` నాకు డబ్బింగ్ పాటలు రాయాలంటే చాలా భయం. ఆ ఫ్లేవర్ ఎక్కడ పడిపోతుందోనని భయపడుతాను. ఈ సినిమాకు మరింత కేర్ తీసుకుని రాశాను`` అని చెప్పారు.
అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ మాట్లాడుతూ `` ఈ సినిమాను రెండు రాష్ట్రాల్లోనూ మేం విడుదల చేస్తున్నాం`` అని తెలిపారు. మా బ్యానర్ లో రిలీజ్ చేసిన సినిమాలన్నీ మంచి విజయాల్ని సాధించాయి. మొదటిసారి మేము నిర్మాణంలో భాగస్వామ్యమైన ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాం.
దామోదరప్రసాద్ మాట్లాడుతూ `` వెంకట్ ఈ సినిమా చేస్తున్నానని చెప్పినప్పుడు ప్రొడక్షన్ ఎందుకని నచ్చజెప్పాను. ఈ సినిమాతో ఏదో ఒకటి నిర్ణయించుకుంటానని చెప్పాడు`` అని అన్నారు.
నిర్మాత వెంకట్ మాట్లాడుతూ, నితిన్, నిత్య మీనన్, నాని లకు మేనేజర్ గా ఉన్న నేను ఇప్పుడు సినిమా కు నిర్మాతను అయ్యాను. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం ఈ ముగ్గురే. నన్ను నమ్మి, నిత్య మీనన్ గారు నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు. సినిమా చాలా బాగా వచ్చింది. సినిమా ప్రతి ఒక్కరికీ తప్పకుండా నచ్చేలా ఉంటుంది.
దర్శకుడు మొహ్మద్ మాట్లాడుతూ `` తెలుగు సినిమాలంటే నాకు చాలా ఇష్టం. నిత్య ఈ సినిమాను తెలుగులో విడుదల చేయడం ఆనందంగా ఉంది`` అని తెలిపారు.
కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి, జెమిని సురేశ్, క్రాంతి మాధవ్, గాంధీ మేర్లపాక, కె.పి.చౌదరి, ఏషియన్ సినిమాస్ సునీల్, యామినీ భాస్కర్, అన్నేరవి, అడవి శేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments