కడప జిల్లాలో జిలెటిన్ స్టిక్స్ పేలి 10 మంది మృతి

  • IndiaGlitz, [Saturday,May 08 2021]

కడప జిల్లా కలసపాడు మండలంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మామిళ్ళపల్లె శివారులోని తిరుమల కొండ సమీపంలో ఉన్న బైరటీస్ గనిలో భారీ ప్రమాదం జరిగింది. ఈ గనుల వద్ద జిలెటిన్ స్టిక్స్ పేలడంతో 10 మంది మరణించారు. మృతదేహాలన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి. పేలుడు ధాటికి కనీసం గుర్తించేందుకు సైతం వీలులేని విధంగా శరీరానలన్నీ తునా తునకైలైపోయాయి. దీంతో మృతదేహాలను గుర్తించేందుకు వీలు లేకుండా పోయింది. మృతదేహాల కోసం ఘటనా స్థలానికి సమీపంలో పోలీసులు గాలిస్తున్నారు.

Also Read: కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న పవన్

మృతులందరూ పులివెందుల ప్రాంతంలోని వేములకు చెందినవారని తెలుస్తోంది. గనుల్లో పేల్చే పనుల కోసం పులివెందుల ప్రాంతం నుంచి కార్మికులు వచ్చారు. కాగా.. నేడు జీపులో నుంచి జిలెటిన్ స్టిక్స్ దించే సమయంలో పేలుడు సంభవించింది. ఘటనా స్థలాన్ని పోరుమామిళ్ల సీఐ మోహన్‌రెడ్డి, కలసపాడు, పోరుమామిళ్ల ఎస్‌ఐలు మద్దిలేటి, మోహన్ పరిశీలించారు. భారీ పేలుడు సంభవించడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నారు.

జగన్, చంద్రబాబు దిగ్ర్భాంతి

ఘటనపై సీఎం జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. పేలుడు ఘటనకు గల కారణాలను జగన్ ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు సైతం దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పేలుడు ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించి.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.