Tamil Nadu:తమిళనాడులో ఘోర ప్రమాదం.. రైల్లోకి అక్రమంగా సిలిండర్ , టీ చేస్తుండగా బ్లాస్ట్.. పది మంది సజీవదహనం
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళనాడులో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. మధురై రైల్వే స్టేషన్ సమీపంలో ఆగివున్న రైలు బోగీలో శనివారం తెల్లవారుజామున 5.15 గంటలకు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో పది మంది దుర్మరణం పాలవ్వగా పలువురు గాయపడినట్లుగా తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా రైల్లోకి అక్రమంగా తీసుకొచ్చిన సిలిండర్‌పై టీ చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. ప్రమాదం సంభవించిన ప్రైవేట్ బోగి ఆగస్ట్ 17న ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నుంచి వచ్చినట్లుగా తెలుస్తోంది. శుక్రవారం దీనిని నాగర్‌కోయిల్ జంక్షన్ వద్ద పునలూరు-మధురై ఎక్స్‌ప్రెస్‌కు తగిలించారు. నిన్న రాత్రి మధురై చేరుకున్నాక అక్కడి రైల్వే సిబ్బంది దీనిని స్టాబ్లింగ్ లైన్‌లో నిలిపి వుంచారు.
గాఢనిద్రలో వుండగా ఘోరం:
ఈ నేపథ్యంలో ప్రైవేట్ భోగిలో ప్రయాణిస్తున్న వారిలో ఒకరు రైల్లోకి అక్రమంగా గ్యాస్ సిలిండర్‌ను తీసుకొచ్చారు. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున టీ తయారు చేస్తుండగా అది ప్రమాదవశాత్తూ పేలింది. దీంతో మంటలు చెలరేగి క్షణాల్లో బోగీ అంతా వ్యాపించాయి. మంటలను గుర్తించిన కొందరు ప్రయాణీకులు వెంటనే బోగీ నుంచి కిందకు దూకేశారు. కానీ కొందరు గాఢ నిద్రలో వుండటంతో వారు కాలిబూడిదయ్యారు.
రైల్వే శాఖ దిగ్భ్రాంతి :
సమాచారం అందుకున్న రైల్వే, పోలీస్, అగ్నిమాపక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో పది మంది మరణించగా.. మరో 20 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో బోగీలో 65 మంది వరకు వున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై రైల్వే శాఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్ధిక సాయం ప్రకటించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout