ద్వివేదీ- జగన్‌ అత్యంత సన్నిహితుడి మధ్య ఏం జరిగింది!?

  • IndiaGlitz, [Sunday,April 28 2019]

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిశాయి. ప్రస్తుతం నేతల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. మే-23న ఎవరు అసెంబ్లీ, పార్లమెంట్‌కి వెళ్తారో...? ఎవరి ఇంటిబాట పడతారో అనేది తేలిపోనుంది. ఫలితాలకు ఇంకా సమయం ఉండటంతో అటు ఈవీఎంలు ఉన్న స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భద్రతపై పలువురు నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎన్నికల ప్రధాన అధికారిని కలుస్తున్నారు. అయితే మరికొన్ని సీసీకెమెరాలు పనిచేయట్లేదని.. ఇలా పలు కారణాలను చూపుతూ ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదితో భేటీ అవుతున్నారు.

ఇదిలా ఉంటే.. శనివారం రాత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు, రాజంపేట ఎంపీ అభ్యర్థి మిథున్ రెడ్డి.. ద్వివేదీతో భేటీ అయ్యారు. సుమారు గంటపాటు వీరిద్దరి మధ్య సుధీర్ఘ చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అయితే సీఈవోతో ఆయన ఏం చర్చించారన్న విషయాలేవీ బయటకు రాలేదు..? భేటీ అనంతరం మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. దీంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ భేటీలో ఏం జరిగింది..? ఎందుకింత రహస్యంగా చర్చించాల్సి వచ్చింది..? అని అధికార పార్టీ నేతలు ఈసీ తీరుపై కన్నెర్రజేస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

కాగా.. మిథున్ రెడ్డి కంటే ముందు పలువురు వైసీపీ నేతలు ద్వివేదితో భేటీ అయ్యారు. ఏపీలో జరుగుతున్న ప్రస్తుత పరిణామాలపై ఫిర్యాదు చేశారు. ఆ తర్వాతే వైసీపీ ఎంపీ అభ్యర్థి ద్వివేదిని కలవడం గమనార్హం. అయితే ఈ వ్యవహారంపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే మరి.