Assembly Elections:తెలంగాణలో మోగిన ఎన్నికల నగారా.. నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు
- IndiaGlitz, [Monday,October 09 2023]
తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎలక్షన్ షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్ కుమార్ విడుదల చేశారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు నవంబర్ 30న ఎన్నికలు జరగనుండగా.. డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్ జరగనుంది. ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ 3న విడుదల కానుండగా.. నవంబర్ 10 నామినేషన్లకు చివరి తేదిగా ప్రకటించారు. ఇక నవంబర్ 13న నామినేషన్ల పరిశీలన జరగనుంది. నవంబర్ 15న పూర్తి స్థాయి అభ్యర్థుల జాబితా ప్రకటించనున్నారు. డిసెంబర్ 5వ తేదీ లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది.
ఇక మిజోరం ఎన్నికలు నవంబర్ 7న.. మధ్యప్రదేశ్ ఎన్నికల నవంబర్ 17న.. రాజస్థాన్ ఎన్నికలు నవంబర్ 30న జరగనున్నాయి. ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లో తొలి దశ నవంబర్ 7.. రెండో దశ వంబర 17న జరగనున్నాయి. మధ్యప్రదేశ్‌లో 230 అసెంబ్లీ స్థానాలు, రాజస్థాన్‌లో 200 స్థానాలు, ఛత్తీస్‌గఢ్‌లో 90 స్థానాలు, మిజోరంలో 40 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
తెలంగాణలో మొత్తం 3.17కోట్ల మంది ఓటర్లు
రాష్ట్రంలో మొత్తం 3.17కోట్లు ఓటర్లు ఉన్నారని సీఈసీ తెలిపారు. పురుష ఓటర్లు 1,58,71,493, మహిళా ఓటర్లు 1,58, 43, 339, ట్రాన్స్‌జెండర్ ఓటర్లు 2,557 మంది ఉన్నారని పేర్కొన్నారు. అందులో 80 ఏళ్లకు పైబడిన వారు 4.43లక్షలు ఉండగా.. వందేళ్లు దాటిన వారు 7,600 మంది ఉన్నారన్నారు. తొలిసారిగా 80 ఏళ్లు దాటిన వృద్ధులకు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 35,655 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు.
5 రాష్ట్రాల్లో 16.14కోట్ల మంది ఓటర్లు..
5 రాష్ట్రాల్లోని 679 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయని సీసీ రాజీవ్ కుమార్ తెలిపారు. 5రాష్ట్రాల్లో 60లక్షల మంది కొత్త ఓటర్లు చేరారన్నారు. 40 రోజుల్లో 5 రాష్ట్రాల్లో పర్యటించామని.. 5 రాష్ట్రాల్లో కలిపి 16.14 కోట్ల ఓటర్లు ఉన్నారని.. అన్ని రాష్ట్రాల్లో మహిళా ఓటర్ల సంఖ్య పెరిగిందన్నారు. వివిధ రాజకీయ పార్టీలో అధికారులతో చర్చించాం.. 6 నెలలుగా ఎన్నికల కోసం కసరత్తు చేస్తున్నామన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని ఆయన వెల్లడించారు.
జనవరి 18వ తేదీతో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ గడువు..
మిజోరం అసెంబ్లీకి డిసెంబర్ 17వ తేదీతో గడువు ముగియనుండగా.. మధ్యప్రదేశ్ అసెంబ్లీ గడువు జనవరి 8, రాజస్థాన్ అసెంబ్లీ గడువు జనవరి 14, తెలంగాణ అసెంబ్లీ గడువు జనవరి 18, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ గడువు జనవరి 3వ తేదీతో ముగియనున్నాయి. మిజోరంలో బీజేపీ మిత్రపక్షం మిజోరం నేషనల్ ఫ్రంట్ (MNF) అధికారంలో ఉండగా.. మధ్యప్రదేశ్‌లో బీజేపీ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్, తెలంగాణలో బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నాయి.