స్టార్ క‌థానాయిక‌ల జోరు హోరు...

  • IndiaGlitz, [Thursday,December 27 2018]

స్టార్ క‌థానాయిక‌ల జోరు హోరు...

ప్ర‌స్తుత ఏడాది కూడా 150కి పైగా సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేసిన‌వే. ఇందులో కొంత మంది కొత్త హీరోయిన్స్ బాక్సాఫీస్ వ‌ద్ద సక్సెస్ అందుకున్నా.. అంద‌రి క‌న్ను స్టార్ హీరోయిన్స్ పైనే నిలిచింది. వీరిలో ముందుగా..

అనుష్క

గ‌త ఏడాది 'బాహుబ‌లి' ..త‌ర్వాత ఈ ఏడాది 'భాగ‌మ‌తి' అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ఈ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన అనుష్క మంచి విజ‌యాన్నే త‌న ఖాతాలో వేసుకుంది. అయితే మ‌రో సినిమాను చేయ‌లేదు. అలాగ‌ని ప‌ర‌భాషా సినిమాలు కూడా చేయ‌లేదు. అనుష్క స‌న్నబ‌డే ప‌నిలో ఉంద‌ని.. అందుక‌నే సినిమాలు చేయ‌లేద‌ని సినీ వ‌ర్గాల్లో వార్త‌లు విన‌పడుతున్నాయి.

స‌మంత

అక్కినేని కోడ‌లైన త‌ర్వాత స‌మంత 'రంగ‌స్థ‌లం'తో విజ‌యాన్ని సొంతం చేసుకుంది. అలాగే మ‌హాన‌టి జ‌ర్న‌లిస్ట్ మ‌ధుర‌వాణిగా మెప్పించింది. యూట‌ర్న్ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీలో న‌టించింది. స‌మంత న‌టించిన తొలి లేడీ ఓరియెంటెడ్ మూవీ ఇది. తెలుగుతో పాటు త‌మిళంలో కూడా విడుద‌లైనా పెద్ద‌గా స‌క్సెస్‌ను సాధించ‌లేదు.

రకుల్ ప్రీత్ సింగ్

గ‌త ఏడాది నాలుగు తెలుగు చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన ర‌కుల్ ప్రీత్ సింగ్ ఈ ఏడాది మాత్రం తెలుగు సినిమాపై శీత‌కన్నేసింది. త‌మిళ సినిమాల‌తో ఫుల్ బిజీగా మారిపోయింది ర‌కుల్‌. ఈ ఏడాదే వ‌చ్చే ఏడాది కూడా ఈమె సినిమాలేవీ తెలుగులో విడుద‌ల కాక‌పోవ‌చ్చున‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. అయితే ఈ ఏడాది హిందీలో ర‌కుల్ చేసిన 'అయ్యారి' సినిమా బాలీవుడ్‌లో మ‌రోసారి ర‌కుల్‌కు నిరాశ‌నే మిగిల్చింది

త‌మ‌న్నా

'బాహుబ‌లి' త‌ర్వాత అచితూచి సినిమాల‌ను ఎంపిక చేసుకుంటుందేమో కానీ త‌మ‌న్నా సినిమాలు చేసే సంఖ్య ప‌రిమితంగా మారింది. తెలుగులో ఈ ఏడాది ఆమె న‌టించిన 'నానువ్వే', 'నెక్ట్స్ ఏంటి' సినిమాలు బాక్సాపీస్ వ‌ద్ద బోల్తాప‌డ్డాయి. కె.జి.ఎఫ్‌లో స్పెష‌ల్ సాంగ్‌లో మాత్ర‌మే న‌టించింది. అది కూడా ఈ నెల 21నే విడుద‌ల కానుంది.

కాజ‌ల్ అగ‌ర్వాల్

సీనియ‌ర్ హీరోల‌తోనే కాదు.. కాజ‌ల్ కుర్ర హీరోల‌తో కూడా జ‌త క‌ట్ట‌డానికి సంకోచించ‌డం లేదు. స్క్రీన్‌ప్లే ప్ర‌ధానంగా సాగిన అ! సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టించి ఒకే అనిపించుకున్న కాజ‌ల్‌కి క‌ల్యాణ్‌రామ్‌తో చేసిన 'ఎం.ఎల్‌.ఎ' జ‌స్ట్ ఒకే మూవీగా నిలిచింది. అయితే కుర్ర హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌తో చేసిన క‌వ‌చం ప‌రాజ‌యాన్నే మిగిల్చింది.

కీర్తి సురేశ్

'నేను శైల‌జ‌' చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన కీర్తిసురేశ్‌.. ఈ ఏడాది అజ్ఞాత‌వాసి సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అయితే ఆ సినిమా నిరాశ‌నే మిగిల్చింది. అయితే అల‌నాటి మ‌హాన‌టి సావిత్రి పాత్ర‌లో న‌టించిన 'మ‌హాన‌టి' చిత్రంలో కీర్తి న‌ట‌న‌కు జ‌నాలు నీరాజ‌నాలు ప‌ట్టారు. స్టార్ హీరోయిన్ స్టేట‌స్‌ను అందుకునేసింది. అయితే మ‌రో తెలుగు సినిమాలో కీర్తి న‌టించ‌నే లేదు. త‌మిళంలో పందెంకోడి 2, సామిస్క్వేర్‌, స‌ర్కార్ చిత్రాల్లో మెరిసింది

పూజా హెగ్డే

తెలుగులో స‌రైన బ్రేక్ లేక‌పోయినా పూజా హెగ్డే మంచి అవ‌కాశాలనే అందుకుంది. ఈ ఏడాది సాక్ష్యం స‌రైన విజ‌యాన్ని అందించ‌క‌పోయినా.. ఎన్టీఆర్‌తో చేసిన అర‌వింద స‌మేత వీర రాఘ‌వ స‌క్సెస్‌ను సొంతం చేసింది

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్

ఈ మ‌ల‌యాళీ ముద్దుగుమ్మ కృష్ణార్జున యుద్ధం, తేజ్ ఐ ల‌వ్ యూ, హ‌లో గురు ప్రేమ‌కోస‌మే చిత్రాల్లో న‌టించింది. ఇందులో హ‌లో గురు ప్రేమ‌కోస‌మే ఓ మోస్తారు స‌క్సెస్‌ను సంపాదించుకుంది. మిగిలిన రెండు చిత్రాలు డిజాస్ట‌ర్స్‌గా మిగిలాయి.

సాయిప‌ల్ల‌వి

ఫిదా, ఎం.సి.ఎ చిత్రాల విజ‌యాలు సాయిప‌ల్ల‌వి తెలుగు ప్రేక్ష‌కులకు మరింత ద‌గ్గ‌ర చేశాయి. అయితే సాయిప‌ల్ల‌వి చేసిన ద్విభాషా చిత్రం క‌ణం ప‌త్తా క‌న‌ప‌డ‌లేదు. ఈ నెల 21న ప‌డిప‌డి లేచె మ‌న‌సు అనే ల‌వ్‌స్టోరీతో మ‌రోసారి అదృష్టాన్ని ప‌రీక్షించుకోనుంది సాయిప‌ల్ల‌వి.

ర‌ష్మిక మంద‌న్నా

ఈ ఏడాది ఈ క‌న్న‌డ బ్యూటీ మూడు తెలుగు సినిమాల్లో క‌నిపించింది. ఛ‌లోతో తెలుగులో స‌క్సెస్ కొట్టిన ర‌ష్మిక గీత గోవిందంతో విజ‌యాన్ని ద‌క్కించుకుంది. నాగార్జున‌, నానితో చేసిన మ‌ల్టీస్టార‌ర్ దేవ‌దాస్ మాత్రం పెద్ద‌గా మెప్పించ‌లేక‌పోయింది.

రాశిఖ‌న్నా

ఈ ఏడాది రాశి మూడు తెలుగు చిత్రాలు, ఒక త‌మిళ చిత్రంలో న‌టించింది.'ట‌చ్ చేసి చూడు', 'తొలిప్రేమ‌', 'శ్రీనివాస క‌ల్యాణం' చిత్రాల్లో న‌టించిన రాశికి 'తొలిప్రేమ'తో చాలా పెద్ద విజ‌యమే ద‌క్కింది.

అను ఇమ్మాన్యుయేల్

ఈ ఏడాది అను ఇమ్మాన్యుయేల్ రెండు సినిమాలు చేసింది. ఆ రెండు మెగా హీరోల‌వే కావ‌డం గ‌మ‌నార్హం. ప‌వ‌న్ క‌ల్యాణ్ 'అజ్ఞాత‌వాసి', బ‌న్నితో చేసిన 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద ప‌రాజ‌యాన్ని మూగ‌ట్టుకున్నాయి. 'శైల‌జారెడ్డి అల్లుడు' అంతంత మాత్రంగానే మిగిలిపోయాడు.

కియరా అద్వాని

'భ‌ర‌త్ అనే నేను'తో బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వాని స‌క్సెస్ సాధించింది. ఇప్పుడు రామ్‌చ‌ర‌ణ్‌తో 'విన‌య‌విధేయ రామ'లో న‌టిస్తుంది. ఇది వ‌చ్చే ఏడాది విడుదల కానుంది.