Mukesh Dalal: లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బోణీ.. సూరత్ ఎంపీ నియోజకవర్గం ఏకగ్రీవం..
Send us your feedback to audioarticles@vaarta.com
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సమరం జరుగుతోంది. ఇప్పటికే తొలి విడత లోక్సభ ఎన్నికల పోలింగ్ పూర్తి అయింది. మరో 4 రోజుల్లో అంటే ఏప్రిల్ 26న రెండో దశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో అప్పుడే ఎంపీ ఎన్నికల్లో బీజేపీ బోణీ కొట్టింది. గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానం ఏకగ్రీవం అయింది. దీంతో అక్కడ బీజేపీ తరపున బరిలో నిలిచిన ముఖేష్ దలాల్ ఎంపీగా ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు అధికారులు ప్రకటించారు. అనంతరం ఆయనకు గెలిచినట్లు ధృవీకరణ పత్రం కూడా అందజేశారు.
కాగా సూరత్ లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున నీలేష్ కుంభానీ నామినేషన్ దాఖలు చేశారు. అయితే నీలేష్ కుంభానీ వేసిన నామినేషన్ను జిల్లా రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. నీలేష్ కుంభానీని ప్రతిపాదిస్తూ నామపత్రాల్లో ముగ్గురు వ్యక్తులు చేసిన సంతకాల్లో తేడాలు ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున మరో అభ్యర్థి సురేష్ పాద్సాలా నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఈ నామినేషన్ పత్రాల్లోని సంతకాల్లో కూడా తేడాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఇద్దరి నామినేషన్లను తిరస్కరించినట్లు రిటర్నింగ్ అధికారి సౌరభ్ పార్థీ ఉత్తర్వులు జారీ చేశారు.
మరోవైపు సూరత్ నియోజకవర్గంలో పోటీలో ఉన్న మరో 8 మంది అభ్యర్థులు సోమవారం తమ నామినేషన్లను వెనక్కి తీసుకున్నారు. ఇందులో ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులు కాగా.. బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి ప్యారెలాల్ కూడా ఉన్నారు. దీంతో పోటీలో ఉన్న ఒకే ఒక్క బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఎంపీగా ఏకగ్రీవం అయ్యారు. ఈ క్రమంలో 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి తొలి విజయం నమోదైంది. మొత్తంగా ఈ ఎన్నికల్లో 400 సీట్లు టార్గెట్గా పెట్టుకున్న కాషాయం పార్టీ ఫలితాలు రాకుండానే ఓ సీటును అధికారికంగా తన ఖాతాలో వేసుకుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments