'ఐశ్వర్యాభిమస్తు' మ్యూజిక్ లాంచ్
- IndiaGlitz, [Thursday,September 27 2018]
శ్రీమతి వరం మాధవి సమర్పణలో శ్రీ శ్రీ శ్రీ శూలినీ దుర్గా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆర్య, విశాల్, సంతానం, తమన్నా, భాను నటించిన చిత్రం 'ఐశ్వర్యాభిమస్తు'. ఎం.రాజేష్ దర్శకుడు. వరం జయత్ కుమార్ నిర్మాత. డి.ఇమ్మాన్ సంగీతం అందించిన ఈ సినిమా పాటల సీడీని కె.ఇ.జ్ఞానవేల్ రాజా బుధవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో విడుదల చేశారు.
రమేశ్ ప్రసాద్ మాట్లాడుతూ - మా నాన్న పెద్ద భూస్వామి అయినా.. నాన్న సినిమాపై అభిమానంతో ఇంట్లో చెప్పకుండా సినిమాల్లో రాణించాలని ముంబై వెళ్లిపోయారు. నెమ్మదిగా ఎదుగుతూ గొప్ప స్థాయికి చేరుకున్నారు. దర్శకుడిగా ఎదిగారు. సినిమాకు సంబంధించిన అన్ని విభాగాలపై మంచి పట్టు సాధించారు. ప్రసాద్ ప్రొడక్షన్స్ సిల్వర్ జుబ్లీలు చాలా తీసింది. సకుటుంబంగా చూడదగ్గ కుటుంబ విలువలున్న సినిమాలను చాలా చేశాం. ఏక్ తుఝే కేలియే కూడా చేశాం. ఇవన్నీ చాలా వండర్స్ సృష్టించాయి.
మా నాన్న సినిమాల పై తప్ప, ఇంకదేనిపై ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొచ్చేవారు కాదు. అందుకే మాకు చెన్నై, ముంబై, బెంగుళూరు, హైదరాబాద్‌లో కార్యాలయాలున్నాయి. అందరిళ్లల్లో మా ప్రసాద్ ప్రొడక్షన్స్ గురించి తెలుసు. నందగోపాల్ అని మా దగ్గర ఆడిటర్ ఉన్నారు. ప్రజలు సినిమా చూడటం వల్లనే నేను ఇలా ఈ స్థాయిలో ఉన్నాను అని అనుకుని రూ.కోటి పెట్టి చారిటబుల్ ట్రస్ట్ ను ఏర్పాటు చేసి, ఐదెకరాల స్థలాన్ని కేటాయించాం. నాగేశ్వరరావుగారు ఓ డాక్టర్. ఆయన కూడా మా నాన్నలాగానే సేవాతత్పరత ఉన్న వ్యక్తి.
మన ప్రజలకు సేవ చేయడానికే ఆయన మన దేశానికి వచ్చాడు. మా ఐ ఇన్‌స్టిట్యూట్ ని అంతర్జాతీయ గుర్తింపు ఉంది. భవిష్యత్తు తరాల వారికీ ఉపయోగపడే ప్రాజెక్ట్ అది. 50 శాతం మందికి మేం అక్కడ ఉచితంగా సేవలు అందిస్తున్నాం అని అన్నారు.
నిర్మాత వరం జయత్ కుమార్ మాట్లాడుతూ - సినిమాను దసరాకు విడుదల చేస్తున్నాం. తప్పకుండా సక్సెస్ అవుతుందని భావిస్తున్నాం. సపోర్ట్ అందిస్తున్న ప్రతి ఒక్కరికీ థాంక్స్ అన్నారు.
కె.ఇ.జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ - నిర్మాత జయంత్‌కు ఈ సినిమా పెద్ద విజయాన్ని తెచ్చిపెడుతుంది. ఆర్యతో నాకు మంచి అనుబంధం ఉంది. తనతో కలిసి ఓ సినిమా చేస్తున్నాను. తమిళంలో సూపర్‌హిట్ అయిన ఈ చిత్రం తెలుగులో కూడా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను అన్నారు.
హీరో ఆర్య మాట్లాడుతూ - మంచి హిలేరియస్ ఎంటర్‌టైనర్. జయంత్ తెలుగులో చేస్తున్న ప్రయత్నం పెద్ద సక్సెస్ కావాలి. పాజిటివ్ పర్సన్ జయంత్ పెద్ద స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. తెలుగులో చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను అన్నారు.