రాఘవ లారెన్స్ పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేవి ముని, కాంచన, గంగ చిత్రాలే. స్టార్ హీరోల కొరియోగ్రాఫర్‌గా పేరున్న లారెన్స్ దర్శకుడుగా, హీరోగా చేసిన హార్రర్ సస్పెన్స్ థ్రిల్లర్స్ ముని, కాంచన, గంగలతో ప్రేక్షకులకు చేరువయ్యారు. ఇప్పుడు లారెన్స్ హీరోగా చంద్రముఖి వంటి సినిమాను డైరెక్ట్ చేసిన సీనియర్ డైరెక్టర్ పి.వాసు దర్శకత్వలో రూపొందిన హార్రర్ థ్రిల్లర్ `శివలింగ`. కన్నడంలో పి.వాసు దర్శకత్వంలో ఇదే పేరుతో రూపొందిన ఈ చిత్రం అక్కడ పెద్ద సక్సెస్ అయ్యింది. మరి తెలుగు, తమిళ ప్రేక్షకులను శివలింగ ఎలా మెప్పించాడో తెలుసుకోవాలంటే సినిమా కథ చూద్దాం...
కథ:
ట్రయిన్‌లో ప్రయాణిస్తున్ రహీమ్(శక్తివాసు)ను గుడ్డివాడు రూపంలో వచ్చిన ఒక వ్యక్తి క్రిందకు తోసేసి చంపేస్తాడు. కానీ ఏ ఆధారాలు దొరకనందున కేసును కోర్టు ఆత్మహత్యగా పరిగణిస్తుంది. అయితే రహీమ్‌ను ప్రేమించిన సంగీత కోర్టు సహాయంతోనే కేసును రీ ఓపెన్ చేయించి సిబి సిఐడికి అప్పగించేలా చేస్తుంది. కొత్తగా పెళ్ళైన సిబి సిఐడి ఆఫీసర్ శివలింగ(రాఘవ లారెన్స్) కేసు టేకప్ చేసి, అందులో భాగంగా భార్య సత్యభామ(రితిక సింగ్)తో కలిసి రహీమ్ ఉండే ఊరికి వస్తాడు. శివలింగ అతని భార్య ఉండే ఇంటి పక్కనే శశ్మానం కూడా ఉంటుంది. కొత్త ఇంటికి వచ్చినప్పటి నుండి భార్య ప్రవర్తనలో మార్పు గమనించిన శివలింగ, తన భార్య శరీరంలోకి రహీమ్ ఆత్మ వస్తుందని తెలుసుకుంటాడు. అప్పుడు శివలింగ ఏం చేస్తాడు? అసలు రహీమ్‌కు, సత్యకు ఉన్న రిలేషన్ ఏంటి? అసలు రహీమ్‌ను ఎవరు చంపారు? చివరకు శివలింగ కేసును ఎలా డీల్ చేశాడు? తన భార్య సత్యను ఎలా బ్రతికించుకున్నాడనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
ప్లస్ పాయింట్స్:
- లారెన్స్, రితిక సింగ్ పెర్‌ఫార్మెన్స్
- సస్పెన్స్‌ను క్యారీ చేసిన తీరు
- సినిమాటోగ్రఫీ
- కామెడి
బలహీనతలు:
- లాజిక్‌లు మిస్ కావడం
- పాటలు అతికినట్లు ఉండటం
విశ్లేషణ:
దర్శకుడుగా, హీరోగా ముని, కాంచన, గంగ వంటి చిత్రాలతో మెప్పించిన లారెన్స్ తొలిసారి వేరే దర్శకుడితో శివలింగ వంటి సినిమా చేయడం కొత్తే అయినా నటన పరంగా లారెన్స్‌కు దెయ్యాలకు భయపడే పిరికివాడు నటించడం కొత్తేమీ కాదు. ఆ విషయం శివలింగతో మరోసారి రుజువైంది. లారెన్స్ సిబి సిఐడి ఆఫీసర్ పాత్రలో మంచి అభినయాన్ని కనపరిచాడు. లుక్స్ పరంగా ఈ సినిమాలో లారెన్స్ బాగానే కనపడ్డాడు. తన మార్కు డ్యాన్సులు కూడా చేసేశాడు. ఇక దెయ్యం పట్టిన పిల్లగా, లారెన్స్ భార్యగా రితిక సింగ్ నటన బావుంది. గురులో బాక్సర్‌గా నటించిన రితిక సింగ్ దెయ్యం ఆవహించిన అమ్మాయిగా చక్కగా నటించింది. ఇంటర్వెల్ బ్లాక్ సహా దెయ్యం పట్టిన సీన్స్‌లో రితిక నటనను మెచ్చుకోకుండా ఉండలేం. డైరెక్టర్ వాసు తనయుడు శక్తివాసు, ముస్లిం కుర్రాడిపాత్రలో చక్కగా నటించాడు. హార్రర్ సీన్స్‌లో మంచి ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చాడు. ఇక పిట్టలదొర పాత్రలో వడివేలు కామెడి బావుంది. ముఖ్యంగా వడివేలు, ఊర్వశి మధ్య సెకండాఫ్‌లో వచ్చే దొంగతనం సీన్ ఆడియెన్స్‌ను బాగా నవ్విస్తుంది. ఊర్వశి, భానుప్రియ, జయప్రకాష్, ప్రదీప్ రావత్ సహా అందరూ బాగా నటించారు. అయితే కొన్ని సీన్స్‌లో కొన్ని క్యారెక్టర్స్ సీరియస్‌గా చెప్పే డైలాగ్స్ నవ్వును తెప్పిస్తాయి. కన్నడంలో సినిమాను డైరెక్ట్ చేసిన పి.వాసు తెలుగు, తమిళంలో కూడా రీమేక్ చక్కగా చేశాడు. నెటివిటీతో పాటు ఎమోషన్స్ కూడా బాగానే క్యారీ చేశాడు డైరెక్టర్ వాసు. క్లైమాక్స్‌లో విలన్స్ సిబి సిఐడి ఆఫీస్‌ను ఎటాక్ చేయడం పెద్ద సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్‌ను ఇరవై మంది రౌడీలు ఎటాక్ చేయడమేంటనేది లాజిక్ లేకుండా కామెడిగా ఉంది. మర్డర్ మిస్టరీని చివరి వరకు క్యారీ చేయడం బావుంది. సర్వేష్ మురారి సినిమాటోగ్రఫీ బావుంది. థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బావుంది కానీ, పాటల ట్యూన్స్ అస్సలు బాలేవు. సన్నివేశాలకు డైలాగ్స్ సరిపోలేదు. మొత్తం మీద హార్రర్ జోనర్ సినిమాలను ఎంజాయ్ చేసే ప్రేక్షకులు `శివలింగ`ను ఎంజాయ్ చేస్తారు.
బోటమ్ లైన్:
శివలింగ.. హర్రర్ సినిమాలో చాలానే వచ్చాయి కానీ పావురం సాక్షిగా ఉండటం, చివరి సినిమాలో మిస్టరీ క్యారీ కావడం అనే ఎలిమెంట్స్ ఆకట్టుకుంటాయి. వడివేలు కామెడి కూడా ఓకే అనిపించింది.
Comments