నాని సినిమాలంటే సర్వత్రా ఆసక్తి కనిపిస్తోంది. కథలను ఎంపిక చేసుకునే పద్ధతి, బోయ్ నెక్స్ట్ డోర్ ఇమేజ్.. ఏదైతేనేం.. నానిని కుటుంబ ప్రేక్షకులకు, యూత్‌కు దగ్గర చేస్తున్నాయి. ఈ మధ్య వరుస విజయాలు అందుకునేలా ప్రోత్సహిస్తున్నాయి. తాజాగా ఆయన నటించిన `నిన్ను కోరి` విడుదలైంది. యథార్థ ఘటన ఆధారంగా శివ నిర్వాణ డైరక్టోరియల్ డెబ్యూ ఇచ్చిన చిత్రమిది. `జెంటిల్మన్` తర్వాత నాని, నివేద కలిసి నటించిన సినిమా. ముక్కోణపు ప్రేమకథగా తెరకెక్కిన `నిన్ను కోరి` అలరించిందో లేదో ఓ లుక్కేసేయండి...
కథ:
ఉమామహేశ్వరరావు(నాని) స్టాటిస్టిక్స్ లో రీసెర్చ్ చేస్తుంటాడు. అతనికి అదే కాలేజీకి చెందిన పల్లవి (నివేదాథామస్) పరిచయమవుతుంది. డ్యాన్సుతో మొదలైన వారి పరిచయం, ఆమెలో అతను ఓ సందర్భంలో నింపిన ధైర్యంతో మరింత పెరుగుతుంది. అది కాస్తా ఒకరిమీద ఒకరికి ఇష్టంగా మారుతుంది. అదే ఇష్టంతోనే ఉమామహేశ్వరరావు తన ఇంటిని ఖాళీ చేసి పల్లవి ఇంటి మేడ మీద గదిని అద్దెకు తీసుకుంటాడు. సెటిలైన కుర్రాడికి తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదన్న పల్లవి తండ్రి (మురళీశర్మ) మాటలు అతనిపై ప్రభావం చూపిస్తాయి. దాంతో పీహెచ్డీ కోసం ఢిల్లీ వెళ్తాడు. అతను వచ్చేసరికి పల్లవి తన తల్లిదండ్రులు చూసిన అబ్బాయి (ఆది పినిశెట్టి)ని పెళ్లి చేసుకుంటుంది. అమెరికాలో సెటిల్ అవుతుంది. కానీ ఉమామహేశ్వరరావు ఆ వార్త విని మానసికంగా డీలా పడతాడు. మందుకు బానిసయి ఉద్యోగాన్ని సరిగా నిర్వర్తించడు. అతని పరిస్థితిని తెలుసుకున్న పల్లవి తీసుకున్న నిర్ణయం వల్ల ఆమె జీవితంలోకి మరలా ఉమా మహేశ్వరరావు వస్తాడు. ఆ నిర్ణయం ఏంటి? అది అతని జీవితాన్ని ఎలా మార్చింది? పల్లవి వైవాహిక జీవితం సజావుగానే సాగిందా? లేదా? అన్నది కీలకాంశం.
ప్లస్ పాయింట్లు:
తన పేరుకు ముందు ఉన్న బిరుదును సార్థకం చేసుకుంటున్నట్టు నాని చాలా నేచురల్‌గా నటించారు. నివేదా కూడా ఎక్కడా తడబడకుండా నానికి గట్టిపోటీ ఇచ్చింది. ఆది పినిశెట్టి సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. గోపీసుందర్ మంచి సంగీతాన్నిచ్చారు. పాటలు స్క్రీన్ మీద వినడానికి బావున్నాయి. బ్రేకప్ సాంగ్ మళ్లీ మళ్లీ వినేలా ఉంది. కెమెరా పనితనం మెప్పిస్తుంది. ఇల్లు ఇంటీరియర్ డిజైన్ కూడా బావుంది. మురళీశర్మ తండ్రి పాత్రలో చక్కగా ఒదిగిపోయారు. పృథ్వి తన మార్కు విట్టులతో నవ్విస్తాడు.
మైనస్ పాయింట్లు:
సినిమా కథలో కొత్తగా ఏమీ లేదు. కథ చాలా పాతదే. ప్రేయసికి పెళ్లయిపోవడం, ఆమె ఇంట్లో ఏదో ఒక కారణంతో మాజీ ప్రియుడు ఉండటం, ఇటు భర్తకు, అటు ప్రియుడికి మధ్య మహిళ సతమతమవడం అనే కాన్సెప్ట్ తో చాలానే కథలు వచ్చాయి. ఈ సినిమాలో కూడా చాలా సన్నివేశాలు ఫ్రెష్‌గా అనిపించవు. ఏదో ఒక సినిమాను గుర్తు చేస్తూనే ఉంటాయి.
విశ్లేషణ:
పెళ్లయిన తర్వాత మాజీ ప్రేమికులతో మాట్లాడటం కూడా తప్పు అనే అభిప్రాయం మన సొసైటీలో బాగానే నాటుకుపోయి ఉంది. ఒకరితో పెళ్లయినంత మాత్రాన ఇంతకు ముందు ప్రేమించిన వారి పట్ల విపరీతమైన ద్వేషాన్ని పెంచుకోవాల్సిన అవసరం లేదనే వాదన ఈ మధ్య కొంచెం కొంచెం పెరుగుతోంది. `నిన్ను కోరి` ఆ విషయాన్ని మరికాస్త ఎక్కువగా ధృడపరిచింది. ప్రేమించిన వారి బాగోగుల గురించి చేసుకున్న భర్తతో ప్రస్తావించ వచ్చనే విషయాన్ని తేటతెల్లం చేసింది. ఈ పాయింట్ ఈ తరానికి చక్కగా కనెక్ట్ అవుతుంది. కాకపోతే సినిమా కొంచెం సేపు సీరియస్‌గా, మరికాస్త సేపు సరదాగా సాగినట్టు అనిపిస్తుంది. కమర్షియల్ యాంగిల్‌ను దృష్టిలో పెట్టుకుని ఇలా స్క్రీన్‌ప్లే డిజైన్ చేసుకున్నారేమో అని అనుకోవచ్చు. ఇప్పటిదాకా వెండితెరమీద కొన్ని జంటలకు ప్రత్యేకత ఉంది. ఇప్పుడు ఆ జంటల కోవలోకి నాని, నివేదా కూడా వెళ్తారు. ఆది పినిశెట్టికి ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే పడతాయి. కుటుంబ విలువలను ఎక్కడా దిగజార్చే ప్రయత్నం చేయని ఈ సినిమా పట్ల కుటుంబ ప్రేక్షకులు తప్పక ఆకర్షితులవుతారనడంలో సందేహం లేదు.
చివరాఖరిగా.. పరిపక్వమైన ప్రేమకథ
Comments