విలక్షణమైన సినిమాలకు ప్రాధాన్యతనిచ్చే స్టార్ హీరోస్‌లో వెంకటేష్ ముందు వరుసలో ఉంటారు. కథ బావుంటే అది మల్టీస్టారర్ మూవీ అయినా, రీమేక్ చేయడానికి సిద్ధమైపోతారాయన. దృశ్యం, గోపాల గోపాల, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి చిత్రాలు ఇందుకు ఉదాహరణలు. ఇప్పుడు వెంకటేష్ చేసిన మరో ప్రయోగమే `గురు`. తన ఏజ్‌కు తగిన కథలో సీనియర్ బాక్సర్ కమ్ కోచ్ పాత్రలో నటించిన గురు చిత్రం హిందీలో సాలాఖద్దూస్, తమిళంలో ఇరుదు సుట్రుఅనే పేరుతో రూపొందింది. హిందీ, తమిళంలో మాధవన్ పోషించిన బాక్సింగ్ కోచ్ పాత్రను వెంకటేష్ ఎలా క్యారీ చేశారో తెలుసుకోవాలంటే కథలోకి వెళదాం...
కథ:
ఆదిత్య రావ్(వెంకటేష్) ఢిల్లీలో బాక్సింగ్ కోచ్‌గా ఉంటాడు. అయితే దురుసుగా ప్రవర్తిస్తుంటాడు. బాక్సింగ్ కమిటీలోని రాజకీయాలకు పావుగామారుతాడు ఆదిత్య. కమిటీలో ఉంటూ అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించే కమిటీ సీనియర్‌తో ఆదిత్యకు గొడవలుంటాయి. దాని కారణంగా ఆదిత్యను వైజాగ్‌కు బదిలీ చేస్తారు. వైజాగ్‌లో లక్ష్మీ(ముంతాజ్) అనే బాక్సర్ పోలీస్ ఆఫీసర్ కావాలనుకుని కలలు కంటూ ఉంటుంది. లక్ష్మికి రామేశ్వరి అలియాస్ రాముడు(రితిక సింగ్) అనే చెల్లెలు ఉంటుంది. ఓ గొడవలో ఆది రామేశ్వరిలో మంచి బాక్సర్ ఉన్నాడని గుర్తించి ఆమెకు డబ్బులు ఇచ్చి బాక్సింగ్ నేర్చుకోవడానికి రమ్మంటాడు. ఆదిత్య దురుసు ప్రవర్తనను ముందు రామేశ్వరి తప్పుగా అర్థం చేసుకుంటుంది. తర్వాత ఆదిత్యలోని సిన్సియారిటిని చూసి తనకు ఎట్రాక్ట్ అవుతుంది. ఆదిత్య, రామేశ్వరికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం లక్ష్మికి నచ్చదు.నేషనల్ బాక్సింగ్ లెవల్‌కు వెళ్ళే సమయంలో లక్ష్మి చేసిన పని కారణంగా రామేశ్వరికి సమస్య వస్తుంది. అప్పుడు ఆదిత్య ఏం చేస్తాడు? ఇంతకు రామేశ్వరి తన సమస్యను దాటి తన లక్ష్యాన్ని చేరుకుంటుందా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
ప్లస్ పాయింట్స్:
- నటీనటుల పనితీరు
- సినిమాటోగ్రఫీ
- సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
- రియాల్టీకి దగ్గరగా సినిమాను రూపొందించడం
మైనస్ పాయింట్స్ః
- సెకండాఫ్‌లో కొన్ని సీన్స్ లాగింగ్‌గా అనిపించడం
- కమర్షియాలిటీకి దూరంగా ఉండటం
విశ్లేషణ:
హిందీ, తమిళ సినిమాల నుండి రీమేక్ చేసిన సినిమా గురులో వెంకటేష్ మరోసారి తన ఏజ్‌కు తగిన విధంగా ఉండే రోల్‌లో అద్భుతంగా నటించాడు. బాక్సింగ్ కోచ్‌గా కనపడటానికి వెంకటేష్ చేసిన ప్రయత్నం, లుక్ తెరపై కనపడింది. దురుసుగా కనపడే కోచ్‌గా, మంచి శిష్యుల్ని బాక్సింగ్ చాంపియన్స్‌గా చేయాలనుకునే గురువుగా వెంకటేష్ పాత్ర అద్భుతం. ఇక రియల్ బాక్సర్ నుండి రీల్ బాక్సర్‌గా నటించిన రితిక సింగ్ నటను గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అల్రెడి రెండు భాషల్లో నటించడంతో తెలుగులో రితిక కరతలామలకంలా తన పాత్రను చేసుకుంటూ వెళ్ళిపోయింది. ముంతాజ్, నాజర్ సహా మిగిలిన పాత్రధారులందరూ వారి వారి పాత్రల్లో ఒదిగిపోయారు. ఇక సాంకేతకంగా చూస్తే..దర్శకురాలు సుధ కొంగర చేసిన రీసెర్చ్ వర్క్ ఆధారంగా కథను తయారు చేసుకోవడమే కాకుండా రియాల్టికీ దగ్గరగా సినిమాను తెరకెక్కించిన విధానం అప్రిసియేట్ చేయాల్సిందే. హిందీ, తమిళంలో హీరోయిన్ నెటివిటీని వేరేలా చూపించిన దర్శకురాలు తెలుగు ప్రేక్షకులకు తగ్గట్లు నెటివిటీని మార్చడం ఆమె దర్శకత్వ పరిణితికి నిదర్శనం. సంతోష్ నారాయణ్ అందించిన ట్యూన్స్ బావున్నాయి. పాటల చిత్రీకరణ కూడా కథలో భాగంగా సాగిపోవడం ఇంకా ప్లస్ అయ్యింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్బ్. నిర్మాణ విలువలు కూడా బావున్నాయి. శక్తివేల్ సినిమాటోగ్రఫీ ప్రతి ఫ్రేమ్‌ను రిచ్‌గా చూపించింది. నిర్మాణ విలువలు కూడా రిచ్‌గా ఉన్నాయి. వెంకటేష్ జింగడి జింగడి పాట పాడటం స్పెషల్‌గా ఉంది.
బోటమ్ లైన్: వాస్తవికతకు దగ్గరగా ఉండే 'గురు'
Comments