ఆడోరకం-ఈడోరకం, కిట్టు ఉన్నాడు జాగ్రత్త వంటి విజయవంతమైన చిత్రాలను తనతో నిర్మించిన నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో హీరో రాజ్‌తరుణ్ చేసిన హ్యాట్రిక్ మూవీ 'అంధగాడు'. ఈ సినిమాతో రచయిత వెలిగొండ శ్రీనివాస్ మెగాఫోన్ కూడా పట్టాడు. అంతే కాకుండా రాజ్‌తరుణ్, హెబ్బా జంటగా ఇది వరకు రెండు సూపర్‌హిట్ చిత్రాల్లో జోడి కట్టారు. ఈ హిట్ జోడికి 'అంధగాడు' చిత్రం హాట్రిక్ మూవీ కావడం విశేషం. టైటిల్‌కు తగ్గట్టుగానే రాజ్‌తరుణ్ సినిమాలో గుడ్డివాడిగా నటించాడు. అసలు రాజ్‌తరుణ్ గుడ్డివాడుగా నటించేంత సబ్జెక్ట్ సినిమాలో ఏముంది..అసలు గుడ్డివాడుగా రాజ్‌తరుణ్ ఎంత సేపు కనపడతాడు..ఇలా విషయాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. మరి అంధగాడు ప్రేక్షకులను ఎలా మెప్పించాడో తెలుసుకోవాలంటే కథలోకి వెళదాం...
కథ:
శారదా ఆశ్రమంలో పుట్టుగుడ్డివాడైన గౌతమ్(రాజ్‌తరుణ్) పెరిగి పెద్దవుతాడు. రాజ్‌తరుణ్‌కు ఓ దాత వల్ల కళ్ళు వస్తాయి. కానీ తనకు వచ్చిన కళ్ళ వల్ల సమస్యలే ఉన్నాయని, తన కళ్ళను తీసేయమని డాక్టర్(ఆశిష్ విద్యార్థి)ని కోరుతాడు గౌతమ్. డాక్టర్‌కు తన కథ చెప్పడంతో సినిమాలో అసలు కథ స్టార్ అవుతుంది. కంటి చూపు లేని గౌతమ్ తనకు కళ్ళను దానం చేసే వారి కోసం కంటి ఆసుపత్రులన్నీ తిరుగుతుంటాడు. ఓ సారి గౌతమ్‌కు కంటి డాక్టరైన నేత్ర(హెబ్బా పటేల్) పరిచయం అవుతుంది. నేత్ర ఎక్కడ దూరమవుతుందోనని గౌతమ్ తాను గుడ్డివాడనే నిజం దాచేసి మెనేజ్ చేస్తుంటాడు. గౌతమ్, నేత్ర మధ్య పరిచయం ప్రేమగా మారిన సమయంలో నేత్రకు గౌతమ్ గుడ్డివాడనే నిజం తెలియడంలో కోప్పడి వెళ్ళిపోతుంది. అయితే చివరకు నేత్ర కారణంగానే గౌతమ్‌కు చూపు వస్తుంది. చూపు రాగానే గౌతవమ్, నేత్రల మధ్య ప్రేమ మళ్ళీ పుడుతుంది. అంతా బావుందనుకునే తరుణంలో గౌతమ్‌కు అసలు సమస్య మొదలవుతుంది. కులకర్ణి(రాజేంద్రప్రసాద్) అనే వ్యక్తి కారణంగా గౌతమ్ బాబ్జీ(రాజా రవీందర్) మనుషలు చంపేస్తాడు? అసలు ఇంతకీ కులకర్ణి ఎవరు? అసలు గౌతమ్ సమస్య ఏంటి? బాజ్జీకి, గౌతమ్‌కు, కులకర్ణికి ఉన్న రిలేషన్ ఏంటి? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...
ప్లస్ పాయింట్స్:
- ప్రథమార్థం
- నటీనటుల పనితీరు
- సినిమాటోగ్రఫీ
- బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్:
- సెకండాఫ్ ఫస్టాఫ్ కంటే ఎఫెక్టివ్‌గా అనిపించదు
- సెకండాఫ్ సాగదీతగా అనిపిస్తుంది
విశ్లేషణ:
మన పక్కింటి అబ్బాయిలా కనిపించే రాజ్‌తరుణ్ చేసిన మరో డిఫరెంట్ చిత్రమిది. నేటి తరం హీరోలు కమర్షియల్ హీరోలుగా, మాస్ హీరోలుగా రాణించాలనుకుంటున్న తరుణంలో గుడ్డివాడుగా నటించాలనుకోవడం కొసమెరుపే. ఇక నటన విషయానికి వస్తే రాజ్‌తరుణ్ గుడ్డివాడి పాత్రలో చక్కగా నటించాడు. బాడీ లాంగ్వేజ్, ఎక్స్‌ప్రెషన్స్ అన్నీ సూటబుల్‌గా చేశాడు. ఇక సెకండాఫ్‌లో ఫైట్స్ కూడా ఇది వరకు చిత్రాలకంటే కాస్తా ఎక్కువగా చేశాడు. సత్యతో కలిసి ఫస్టాఫ్‌లో మంచి కామెడి చేశాడు. రాజ్‌తరుణ్, సుదర్శన్ మధ్య ఉన్న రెండు సీన్స్ బావున్నాయి. హెబ్బా పటేల్ ఓకే. పాత్రకు న్యాయం చేసింది. సినిమాలో పెద్ద గ్లామర్‌గా కనిపించలేదు. కులకర్ణి పాత్రలో రాజేంద్రప్రసాద్ ఒదిగిపోయాడు. ఇక మెయిన్‌విలన్‌గా చేసిన రాజా రవీందర్, సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో పాత్రలో ఒదిగిపోయాడు. జయప్రకాష్‌రెడ్డి, ఫిష్ వెంకట్ సహా మిగిలిన నటీనటులందరూ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. వెలిగొండ శ్రీనివాస్ దర్శకుడిగా చేసిన తొలి ప్రయత్నం బావుంది. కథలో చాలా ట్విస్టులను కన్‌ఫ్యూజన్ లేకుండా తెరపై చూంచాడు. ఫస్టాప్‌ను ఎంటర్‌టైనింగ్‌గా తెరకెక్కించాడు. ఇక సెకండాఫ్‌లో అసలు కథ మొదలవడం, ట్విస్టులు ప్రారంభం కావడం, రివీల్ కావడం ఇలా కాస్తా సాగదీతగా అనిపిస్తుంది. ఇక శేఖర్ చంద్ర ట్యూన్స్‌లో రెండు పాటలు బావున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బావుంది. రాజశేఖర్ సినిమాటోగ్రఫీ చాలా బావుంది. అయితే సెకండాఫ్ చూస్తుంటే పక్కా కమర్షియల్ మూవీలా అనిపిస్తుంది. ఎం.ఆర్.వర్మ సెకండాఫ్‌లో విషయంలో కాస్తా కేర్ తీసుకుని కత్తరించేసి ఉంటే బావుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి.
బోటమ్ లైన్: ఎంటర్‌టైన్‌మెంట్, రివేంజ్ కలగలిపిన 'అంధగాడు'
Comments