అఖిల్ మూవీ రివ్యూ
Send us your feedback to audioarticles@vaarta.com
అఖిల్ అక్కినేని అనే పేరు ఇటీవలి కాలంలో సినిమా పరిశ్రమలోనే కాదు... సర్వత్రా ఆసక్తిగా వినిపిస్తున్న పేరు. అక్కినేని మూడో తరం కథానాయకుడిగా సినిమా పరిశ్రమకు పరిచయం కానున్నారు అఖిల్. అక్కినేని నాగేశ్వరరావు మనవడు, అక్కినేని నాగార్జున కొడుకు, అక్కినేని నాగచైతన్య తమ్ముడు.. అన్నిటికీ మించి చిన్నప్పటి సిసీంద్రి ఈ యువహీరో. అమల పెంపకంలో నవనీతంగా పెరిగినా, వంశపారంపర్యంగా వచ్చిన నటనాచాతుర్యంతో `అఖిల్`లో చెలరేగి చేశారని టాక్. ప్రీ రిలీజ్ బజ్ నిజమేనా? తెరమీద నిజంగా అఖిల్ చెలరేగిపోయాడా? అఖిల్ లాంచింగ్‌కి `అఖిల్` సరైన కథేనా? ఇలాంటి అంశాలకు సమాధానమే ఈ రివ్యూ... మరి చదవండి.
కథ
సూర్యుని నుండి ఏర్పడిన భూమికి సూర్యుని వేడి కారణంగానే ప్రమాదం ఉందనేది ఎప్పుడో మన పూర్వీకులు చెప్పారు. అయితే దానికి వారే సమాధానాన్ని కూడా కనిపెట్టారు. అదే పవర్ ఆఫ్ జువా. లోహగోళమైన పవర్ ఆఫ్ జువాను భూమద్యరేఖ వద్ద నున్న ఓజో అనే ఆఫ్రికా తెగవారు సంరక్షిస్తుంటారు. అయితే ఖత్రోచి అనే రష్యన్ పవర్ ఆఫ్ జువా గురించి తెలుసుకుని అది తన వద్ద ఉంటే తనకు మంచిదని దాన్ని తెచ్చి పెట్టమని ముఖేష్(మహేష్ మంజ్రేకర్), మాంబో అనే ఆఫ్రికన్‌కు అప్పగిస్తారు. ఓజో జాతిపై జరిగే దాడిలో వాళ్ళు దాన్ని బోడో అనే యువకుడికిచ్చి దాన్ని వచ్చే సూర్యగ్రహణం వరకు కాపాడమంటారు. వారి నుండి తప్పించుకునే క్రమంలో బోడో ఓ జలపాతంలో పవర్ ఆఫ్ జువాను దాచేసి యూరప్ వెళ్ళిపోతాడు. మరోవైపు అనాథ అయిన అఖిల్(అఖిల్), దివ్యను మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. ఆమె ప్రేమకోసం దివ్య పెళ్ళి చెడగొడతాడు. చదువుకోసం యూరప్ వెళ్ళిన దివ్యను అఖిల్ ఫాలో అవుతాడు. అక్కడే దివ్యకు బోడో పరిచయం అవుతాడు. విలన్ గ్యాంగ్ జరిపే దాడిలో బోడో చనిపోతాడు. పవర్ జువా సీక్రెట్ దివ్యకు బోడో, చెప్పి ఉంటాడనే ఉద్దేశంతో ఆమెను మాంబో అండ్ గ్యాంగ్ కిడ్నాప్ చేస్తారు. దాంతో అఖిల్ రంగంలోకి దిగి దివ్యను కాపాడాలనుకుంటాడు. ఆ క్రమంలో అఖిల్ ఎలాంటి పరిస్థితలను ఎదుర్కొంటాడు? పవర్ ఆఫ్ జువాను అఖిల్ కనుక్కొంటాడా? ఓజో తెగవారు, అఖిల్‌ను ఎలా కలుస్తారు? చివరకు ప్రపంచాన్ని అఖిల్ కాపాడాడా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్
అఖిల్ నటన, డ్యాన్సులు, ఫైట్స్ బాగా చేశాడు. తొలి సినిమా అయినా స్క్రీన్‌పై ఎనర్జిటిక్‌గా నటించాడు. యాక్షన్ సన్నివేశాలు బాగా చేశాడు. తొలి సినిమాలోనే సిక్స్ ప్యాక్ చూపించేశాడు. అనుకున్న దాని కంటే బాగా డ్యాన్సులు చేశాడు. హీరోయిన్ తన పాత్రకు న్యాయం చేసింది. నాగ్ గెస్ట్ అప్పియరెన్స్ సూపర్. నాగ్ చాలా గ్లామర్‌గా కనపడ్డాడు. అక్కినేని అక్కినేని...సాంగ్ లో ఆర్ట్ వర్క్ బావుంది. థమన్, అనూప్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరావాలేదు. పప్తగిరి, సావిత్రి కామెడి బిట్ యాడ్ చేసినట్టున్నా ఆ కామెడి బిట్ బావుంది. మహేష్ మంజ్రేకర్, బ్రహ్మానందం, వెన్నెలకిషోర్, రాజేంద్రప్రసాద్‌లు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
మైనస్ పాయింట్స్
వినాయక్ డైరెక్షన్ మూవీయేనా అనిపిస్తుంది. సినిమాలో అనుకున్న పాయింట్‌ను సరిగా ఎలివేట్ చేయలేకపోయారు. కథలో అనుకున్నపాయింట్ సోషియో ఫాంటసీ అయినా సినిమా స్టార్టింగ్, ఎండింగ్‌లో మాత్రమే ఓజో తెగవాళ్ళు కనపడతారు. మిగతా కథంతా ఎలాగెలాగో సాగుతుంది. ఫస్టాఫ్‌లో అఖిల్, రాజేంద్రప్రసాద్‌లు కలిసి చేసే ఆపరేషన్ సీన్ అమ్మేచుర్‌గా ఉంది. పెద్ద పెద్ద డాక్టర్లకే అర్థం కానీ గుండె ఆపరేషన్ అనే పాయింట్‌ను సిల్లిగా చూపించడం కోనెవెంకట్, వెలిగొండ లాంటి గొప్ప రచయితలకు సిల్లిగా అనిపించలేదేమో మరి. థమన్, అనూప్ మ్యూజిక్, మణిశర్మ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు పెద్ద అడ్వాంటేజ్ కాలేకపోయాయి. అమోల్ రాథోడ్ సినిమాటోగ్రఫీ సో సోగానే ఉంది. పెళ్ళి చెడగొట్టాడని వెన్నెలకిషోర్ స్నేహితుడుని చంపాలనుకునే ఉద్దేశంతో హీరోయిన్ యూరప్‌కు వెళ్ళడం ఎంత సమంజసమో రచయితలకే తెలియాలి. గౌతంరాజు ఎడిటింగ్ ఫస్టాఫ్ వరకు బావుంది. సెకండాఫ్ ఆకట్టుకోలేదు. ఇంకా సన్నివేశాలను కత్తిరించేసి ఉండవచ్చు. నిర్మాణ విలువలు బావున్నాయి
విశ్లేషణ
అఖిల్ ఎంట్రీ కోసం చాలా రోజులు వెయిట్ చేశాడు. అందుకు కారణమడిగితే మంచి కథ కోసం వెయిట్ చేస్తున్నానని చెప్పాడు. దాంతో అక్కినేని అభిమానులు అఖిల్ ఎలాంటి సినిమాతో ఎంట్రీ ఇస్తాడోనని ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ అఖిల్ అభిమానులను అలరిస్తాడేమోకానీ ప్రేక్షకులు మాత్రం ఆకట్టుకోలేడు. వాడు నచ్చే వరకు అలాగే ఉంటాడు. నచ్చితే ఎంత బాగా నచ్చుతాడంటే అంత బాగా నచ్చుతాడు., లవ్ అంటేనే ఫైర్, ఫియర్ ఉండకూడు, ఈ జనరేషన్‌లో అందరూ హీరోలనుకుంటారు కానీ గెలిచినవాడినే హీరో అంటారు...ఇలాంటి డైలాగ్స్ కొన్ని బావున్నాయి. థమన్, అనూప్ మ్యూజిక్, మణిశర్మ బ్యాక్ గ్రౌండ్‌స్కోర్, అమోల్ రాథోడ్ సినిమాటోగ్రఫీ సినిమాకు వెన్నుదన్నుగా నిలవలేకపోయాయి. వెన్నెలకిషోర్, బ్రహ్మానందం,మహేష్ మంజ్రేకర్ కామెడి పార్ట్ నవ్వించలేకపోయింది. నాగ్ లుక్, అప్పియరెన్స్ అదిరిపోయింది. క్లయిమాక్స్‌లో పాండ్ సీన్ ఆకట్టుకుంటుంది.
బాటమ్ లైన్..
అక్కినేని అభిమానులు అయితే అఖిల్ సినిమాను చూడవచ్చు. మొత్తం అఖిల్ అభిమానులకు మాత్రమే.
రేటింగ్: 2.5/5
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments